Thursday, February 21, 2013

శ్లో 10: భీముడు Vs దుర్యోధనుడు..

అర్జున విషాద యోగం: పదవ శ్లోకము
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విద మేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||

తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)

భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం.
 
నేపధ్యం..
భీష్ముడు కౌరవుల సైన్యానికి నాయకుడు. ఇటు పాండవులకి భీముడు సేనాని కాకపోయినా,  భీముడి రక్షణ లో ఉన్న పాండవ సైన్యం అనడం లో దుర్యోధనునికి భీముడంటే ఉన్న వైరం  కనపడుతుంది. తనకి దీటైన వాడు పాండవ సైన్యం లో భీముడే అన్న నమ్మకమూ కనిపిస్తుంది.
చిన్నప్పుడు..
చిన్నప్పటినుంచీ భీముడికీ, దుర్యోధనుడికీ ఏనాడూ పడలేదు.  పాండు రాజు మరణించాకా మాద్రి సహగమనం చేయగా, కుంతీ దేవి ఐదుగురు పాండవులనీ తీసుకుని హస్తినాపురానికి వస్తుంది. మొదటి నుంచీ భీముడు చాలా బలమైన పిల్లవాడు. అలాగే తుంటరి కూడా!
చిన్నప్పుడు పాండవులూ, కౌరవుల ఆటల్లో పాండవుల దే పై చేయి అవుతూ ఉంటుంది.  వేగంలో, లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం లో, తిండి లో, దుమ్ము రేపడం లాంటి విషయాల్లో అన్నింటిలో పాండవుల ఆధిక్యత దుర్యోధనుడు సహించలేకపోయేవాడు. భీముడు కౌరవులందరినీ కొట్టి ఆనందించేవాడు. అలాగే వారి జుట్టు పట్టుకుని లాగి ఒకరిని ఒకరు ఢీ కొట్టుకునే లా చేసి  పక పకా నవ్వేవాడు.  జుట్టు చేత బట్టి బరబరా నేల మీద ఈడుస్తూ తీసుకెళ్లే వాడు. పది మంది కౌరవులని ఒక్కసారి గా నీట ముంచి గిల గిల తన్నుకుని ఊపిరి దాదాపు ఆగిపోయేదాకా వదలకుండా ఏడిపించేవాడు. కౌరవులు పండ్లు కోయాలని చెట్లెక్కితే, కాండాన్ని పట్టుకుని ఊపి, పండ్లతో బాటు పిల్లలూ పడేలా చేసి ఆనందించేవాడు.
వీటి తో విసిగి వేసారి దుర్యోధనుడు భీముని పట్ల అంతులేని అయిష్టతనీ, అసహనాన్ని,కోపాన్నీ పెంచుకున్నాడు. అయితే భీముడి బలానికి భయపడి, భీముడు నిద్రపోతున్నప్పుడు గంగలోకి  పడేయాలని తలచి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 
కొన్నాళ్లకి అవకాశం రానే వచ్చింది. ప్రమాణకోటి అన్న స్థలం దగ్గర గంగ ఒడ్డున ఒక రాచ భవనం తయారయింది. అక్కడ రాకుమారుల వినోదం కోసం నీటి లో ఎన్నో రకాల ఆటలు ఆడేందుకు అనువు గా ఎన్నో అమర్చారు. అక్కడకి వెడదామని దుర్యోధనుడు పాండవులని పిలుస్తాడు.  అందరూ అక్కడ ఆట పాటల్లో, విందులూ, వినోదాల్లో మునిగి తేలుతూ సంతోషం గా గడుపు తున్నప్పుడు దుర్యోధనుడు శక్తివంతమైన విషాన్ని తెచ్చి భీముని ఆహారం లో కలిపుతాడు. స్పృహ తప్పిన భీముడిని లతలతో కట్టి గంగలో విడుస్తారు. అయితే భీముడు నాగలోకానికి వెళ్లటం,అక్కడ విషానికి విరుగుడు లభించడమే కాక అమృత తుల్యమైన ద్రవం తాగి పదివేల ఏనుగుల బలం తో వెనక్కి రావడం జరుగుతుంది. పాండవులు ఈ విషయం బయటికి పొక్క నీయకుండా యుదిష్టిరుని మాట మీద మౌనం వహిస్తారు.
ఇంకో మారు కూడా దుర్యోధనుడు భీమునికి కాల కూట విషం ఇచ్చి నప్పుడు యుయుత్సుడు (ధృతరాష్ట్రునికి ఒక వైశ్య స్త్రీ ద్వారా పుట్టిన కొడుకు) హెచ్చరిస్తాడు. అయినా భీముడు ఒక్క గుక్క లో తాగి హరాయించుకుంటాడు.
విద్యార్థులుగా..
భీమ దుర్యోధనులిద్దరూ ఒకే రకమైన ప్రజ్ఞ గలవారు. దానితో ద్రోణుని దగ్గర విద్యాభ్యాసం కూడా చాలా స్పర్థలకు దారితీసింది.
ద్రోణాచార్యునికి గురు దక్షిణ గా ద్రుపదుని ఓడించి ముందు నిలుపుతామని ప్రతిజ్ఞ చేసిన కౌరవులు పరివార సహితం గా దండెత్తి చిత్తు గా ఓడిపోగా, పాండవులు ఆ పని చేసి ఖ్యాతి సంపాదించు కోవడం తో దుర్యోధనునికి అవమాన కరం గా తోస్తుంది.
పెద్దవారయ్యాకా..
లక్క ఇంటి దహనం తర్వాత  భీముడు దుర్యోధనుని క్షమించ లేకపోతాడు.  పాండవులు, పిన తల్లి తో సహా మరణించారని, తానే ఇక హస్తినాపురి కి మహా రాజునన్న ధీమా తో ఉన్న దుర్యోధనునికి వీరు ద్రౌపది ని స్వయంవరం లో గెలుచుకుని మళ్లీ వెనక్కి రావడం,
దానితో పోయారనుకున్న వారు, ఖాండవ వనాన్ని ఇంద్రప్రస్థం గా మలచుకుని అత్యంత వైభోగంగా ఉంటూ, రాజసూయ యాగం తో, తమకి భారత వర్షం లో ఎవ్వరూ సాటి లేరని చెప్పకనే చాటి చెప్పడం.. దుర్యోధనుడు భరించలేకపోతాడు. మయసభ విశేషాలు చూస్తున్నప్పుడు అక్కడి వింతల వల్ల పడిపోయినప్పుడు, తగిలించుకున్నప్పుడు భీమార్జునులు నవ్వడం తో ఓర్వలేక  జూదం పేరుతో పాండవులని ఓడించి వారికి ఏమీ లేకుండా చేయాలని దుర్యోధనునికి కోరిక కలుగుతుంది. దాని వెనక ప్రేరణ కర్ణుడు మరియు శకుని.
జూదంలో పాండవులు ఓడి కౌరవులకి దాసులై వారి భార్య(ద్రౌపది) నీ దాసిని చేసాకా, ద్రౌపదిని అనరాని మాటలు అని, నిండు సభలో  ద్రౌపది వస్త్రాపహరణం సమయం లో, భీముడు తన అన్న ధర్మరాజు మాటకి కట్టుబడి క్రోధాన్ని, అవమాన భారాన్నీ దిగమింగుకున్నా, కర్ణుని మాటలకి కలిగిన ఆవేశాన్ని బలవంతం గా ఆపుకుని దుర్యోధనుడినికి ‘సూత పుత్రుడు అన్న మాటలని దాస్యం వాళ్ల కోపం తెచ్చుకోకుండా ఊరుకున్నాను.. కానీ..అదే శత్రువులైతే నా.. ‘ అని  సమాధానం చెప్తున్నంత లో,..  దుర్యోధనుడు కర్ణునికి మద్దతు తెలుపుతూ, ద్రౌపది కి తన ఎడమ తొడ ని చూపించి సంజ్ఞ చేసినప్పుడు, భీముడు ఆ ఎడమ తొడని యుద్ధ భూమి లో బద్దలు కొడతానని ప్రతిజ్ఞ చేస్తాడు.  దుర్యోధనుడూ యుద్ధ భూమి లో భీముని చంపాలని ఉవ్విళ్ళూరతాడు
వన వాసానికి పంపేసినా పాండవులతో ఏదో విధం గా పేచీ పెట్టుకుని ఆనందించాలని  దుర్యోధనుని కోరిక. కర్ణుడు పాండవులు నార బట్టలు కట్టి అడవుల్లో తిరుగుతున్నప్పుడు నీవు, నీ భార్య, ఇతర పరివారం అనుభవిస్తున్న వైభోగం, పట్టు వస్త్రాలు,అలంకారాలు,వాహనాలు, మందీ,మార్బలం చూపిస్తే వచ్చే ఆనందానికి ఏదీ సాటి రాదని ఇచ్చిన  సలహా మేరకు గోవుల తనిఖీ పేరున పాండవులు నివసించే ద్వైతవనం పక్క నున్న పశుశాలల తనిఖీ కి వెళ్లినట్లు గా వెళ్లి పాండవులకి తమ వైభోగం చూపించి వారి కళ్లల్లో ఈర్ష్య చూడాలని వెళ్లి గంధర్వుల దాడిలో ఓడి  అంతఃపుర స్త్రీలతో సహా బంధింప బడి చివరకు పాండవులే యుద్ధం చేసి విడిపించి పంపించడం తో దుర్యోధనునికి అవమాన భారం ఇంకా ఎక్కువైంది.
పాండవులు తమ మానాన వనవాసం లో కాలం గడుపుతున్నప్పుడు దుర్యోధనుని బావ సింధురాజు జయదద్రుడు ద్రౌపది ని చెరపట్టి తీసుకెళ్లుతుండగా పాండవులు ఎదిరించి, చంపబోగా ద్రౌపది చెల్లెలి భర్త ని వదలమని చెప్పడంతో భీముడు  అతనికి గుండు గొరిగించి పంపుతాడు. ఇదీ ఒక అవమానం గా ఇటు దుర్యోధనుడు, అటు భీముడూ భావిస్తారు.
పాండవులు పన్నెండేళ్ళు వనవాసం చేశారు. దాదాపు యవ్వనమంతా కందమూలాలు తింటూ,నారా వస్త్రాలతో, అడవుల్లో గడిపారు. తర్వాత అజ్ఞాత వాసం లో విరాట రాజుకి దాస్యం చేస్తున్నప్పుడు కూడా చారులని పెట్టి వారిని ఎలాగో ఒక లాగున కనిపెట్టి తిరిగి అడవుల పాలు చేయాలనే దుగ్ధ తో ఉన్న దుర్యోధనునికి  మత్స్య దేశపు రాజు విరాటుని బావమరిది కీచక వధ విషయం తెలిసి, ఇది చేసినది తప్పక భీముడే నని భావించి గోగ్రహణానికి పరివార సహితం గా వస్తే అక్కడా ఓటమి తప్పలేదు. 
షరతు మేర పన్నెండేళ్లు వనవాసం, ఏడాది పాటూ అజ్ఞాత వాసం చేసి మాట నిలుపుకున్న పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వనని, ఆ మాటకొస్తే పాండవులు కురువంశానికి చెందినవారే కారన్నట్టు దుర్యోధనుడు అన్న మాటల తర్వాత ఏ సంధి ప్రయత్నాలూ ఫలించలేదు.
ఈవిధం గా ఇద్దరు దాయాదులూ  యుద్ధం లో తలపడటానికి ఉవ్విళ్ళూరుతున్నారు...

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

Sunday, February 17, 2013

శ్లో: 8,9 - కౌరవుల పక్షాన నిలచిన మహా వీరులు..


అర్జున విషాద యోగం: ఎనిమిది,తొమ్మిదవ శ్లోకములు

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ || 
అన్యే చ బహవశ్శూరాః మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||  

తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)
మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి వున్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులూ, యుద్ధవిశారదులూ నా కోసం జీవితాల మీద ఆశ వదలి సిద్ధంగా వున్నారు.
నేపధ్యం:

ద్రోణుడు: భరద్వాజ ముని కొడుకు. భరద్వాజ ముని తన గంగా దేవికి ఆర్ఘ్యం ఇవ్వటానికి రోజూ లాగే వెళ్లినప్పుడు ఒక అందమైన స్త్రీ ఘ్రితాచి ని నీటిలో చూసి, ఆకర్షింపబడి నప్పుడు వీర్యాన్ని ఒక గిన్నె లో భద్రపరుస్తాడు. అందులోంచి పుట్టిన వాడే ద్రోణుడు. ఇతను తన తండ్రి వద్దే విద్యాభ్యాసం చేస్తాడు. ద్రుపదుడు కూడా భరద్వాజ ముని వద్దే విద్యాభ్యాసానికి రావడం తో ద్రోణునికి, ద్రుపదుని తో స్నేహం కుదురుతుంది. ద్రోణుడు శారద్వతుని కుమార్తె కృపి ని పెండ్లాడతాడు.వీరి కుమారుడే అశ్వత్థామ. ఎన్నో అస్త్ర శాస్త్రాల జ్ఞాని అయిన  జమదగ్ని మహర్షి తనకున్నదంతా దానం చేసి అడవులకి వెళ్తున్నాడని  విని ద్రోణుడు తన శిష్యులతో కూడి మహేంద్ర పర్వతాల దగ్గరకి వెళ్లి తన గురించి చెప్తాడు. అప్పటికే ఆస్తి పాస్తులన్నింటినీ దానం చేసిన మహర్షి తన అస్త్ర శస్త్రాలన్నిటినీ ద్రోణునికి ఇచ్చి వేస్తాడు. (మిగిలిన కథ : రెండవ శ్లోకం వివరణ లో..)
భీష్ముడు : మహాభారతం గురించి ఒక పేజీ రాసినా, భీష్ముడి గురించి ఒక వాక్యమైనా రాయకుండా ఉండలేము. అందరికీ తెలిసిన కథే అయినా నాలుగు ముక్కలు.. వశిష్టుడి శాపం మూలంగా, అష్ట వసువులూ భూమి మీద శంతనునికీ, గంగ కీ పుడతారు. వారిలో ఆఖరి వాడు (ద్యౌ అని పేరు గల  వసువు)దేవ వ్రతుడు. వశిష్టునివద్ద విద్యాభ్యాసం చేశాడు.శంతనుడు దేవవ్రతుని పెంచి పెద్ద చేయలేదు.పుట్టాకా మళ్లీ విద్యాభ్యాసం అయిన తర్వాతే యాదృచ్ఛికం గా అతనిని చూస్తాడు.  గంగ దేవవ్రతున్ని తండ్రికి అప్పచెప్పిన నాలుగు సంవత్సరాలకి శంతనుడు సత్యవతి తో ప్రేమ లో పడి అది సఫలం కాలేదని పుట్టెడు దుఃఖం లో ఉండటం గమనించి సత్యవతి తండ్రి తో మాట్లాడి అతని షరతు ని అంగీకరించి ఆజన్మాంతం బ్రహ్మచారి గా ఉంటాననీ, అలాగే రాజ్యాధికారాన్ని స్వీకరించననీ, శపథం చేసి ‘భీష్ముడు’ అని పిలవబడతాడు.అలాగే ఐచ్చికమరణం పొందే వరాన్ని పొందుతాడు. తండ్రి మరణానంతరం కురు రాజ్య సంరక్షణ భారంతో పాటూ  సత్యవతి కుమారులైన చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల సంరక్షణ భారం కూడా చూసుకుంటాడు. ముందు  చిత్రాంగదుని రాజుని చేసి, తర్వాత అతను  గంధర్వులతో జరిగిన యుద్ధం లో మరణించగా,  అప్పటికి ఇంకా చిన్నవాడే అయిన విచిత్రవీర్యున్ని రాజుని చేసి, అతని తరఫున పాలించాడు. అతనికి  వివాహం చేయడానికి కాశీ రాజు కుమార్తెలని (అంబ, అంబాలిక, అంబిక) స్వయంవరం నుంచి ఎత్తుకొచ్చి అడ్డు వచ్చిన రాజులని ఓడిస్తాడు.  అంబ స్వయవరం లో శోభ దేశ రాజుని ఎంచుకోవాలని కోరుకున్నానని, అది తండ్రికీ ఇష్టమేననీ, ఈవిధం గా ఎత్తుకు రాకపోయి ఉంటే తాము భార్యా భర్తలయ్యేవారమని చెప్పగా, ఆమెని పంపించివేస్తాడు. ఈ విధం గా తిరిగి పంపించిన స్త్రీ ని పెండ్లాడనని శోభ రాజు చెప్పడం తో, అంబ తిరిగి భీష్ముని దగ్గరకి వస్తుంది  విచిత్రవీర్యుడు తిరస్కరించగా ఆమె కనీసం భీష్ముడిని తనను పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంది. భీష్ముడు తాను వచన బద్ధుడనని, క్షమించమని అడగగా, వెళ్లి భీష్ముని చంపాలన్న దీక్ష లో ప్రాణాలు విడుస్తుంది. ఈ అంబే భీష్మ వధ ధ్యేయం తో ద్రుపద రాజుకి శిఖండి గా పుడుతుంది. ఏడు సంవత్సరాల తర్వాత విచిత్ర వీర్యుడు క్షయ తో మరణించగా, సత్యవతి తన ప్రతిజ్ఞని వెనక్కి తీసుకుని కురు వంశం ముందుకి వెళ్లేందుకు వీలుగా పెళ్లి చేసుకొమ్మని ప్రార్థించగా, అంగీకరించడు. దానితో వ్యాసుని సహాయం తో అంబాలిక పాండు రాజుని కనగా, అంబిక ధృతరాష్ట్రుని కంటుంది. అలాగే, వ్యాసుని రూపాన్ని, అతని నుంచి వచ్చే వాసనని (రెఫ్: సెక్షన్ 106 :సంభవ పర్వ )తలచుకుని భయపడి దాసీ స్త్రీ ని పంపగా విదురుడు పుడతాడు. భీష్ముడు వీళ్ల పెంపకం భారం కూడా వహించి, హస్తినాపుర సింహాసనానికి సంరక్షకుడిగా నిలబడతాడు.  గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి గాంధారదేశ రాకుమారిని అడిగి తెచ్చి పెళ్లి చేస్తాడు. పాండు రాజుని కుంతీదేవి స్వయంవరానికి పంపి కుంతీ దేవితో పెళ్లి చేయించి, శల్యునికి కన్యాశుల్కమిచ్చి మాద్రీ దేవిని పాండు రాజుకి రెండవ భార్య గా తెస్తాడు. పాండవులకి,  కౌరవులకి ద్రోణుని గురువు గా నియమించి విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా,..  లక్క గృహ దహనం తర్వాత ద్రౌపది తో పెళ్లి జరిగి పాండవులు బ్రతికే ఉన్నారని బయట పడ్డాకా, పాండవులకి రాజ్యం లో కొంత భాగం ఇవ్వడం లో ప్రముఖ పాత్ర వహిస్తాడు.  అయితే, తర్వాత తర్వాత, ఎప్పుడైతే దుర్యోధనుని ప్రాబల్యం పెరిగిందో, కర్ణుడు ,శకుని వంటి వారి తో భీష్ముని విబేధాలు, పలు మార్లు, అంటే జూదం, ద్రౌపది వస్త్రాపహరణం, గోగ్రహణం.. అలాగే సంధి ప్రయత్నాల్లో..  యుద్ధానికి ముందు కనపడుతూనే ఉంటాయి.
కర్ణుడు; కర్ణుడు లేనిదే భారతం లేదంటారు. (నిజానికి భారతం లో ప్రతి పాత్ర కీ ఔచిత్యం ఉంది). కర్ణుడు కుంతీ పుత్రుడు. కుంతీదేవి దుర్వాస మహామునికి సేవ చేసి సంపాదించుకున్న  వరం మేరకు సూర్య భగవానుని అనుగ్రహం తో సహజ కవచ కుండలాలతో కర్ణుని కంటుంది. అయితే పెళ్లి కాకుండానే కన్న బిడ్డ అవడం తో లోక భయానికి త్యజించవలసి వస్తుంది. కర్ణుడిని ఒక సూతుడు,అతని భార్య రాధ పెంచి పెద్ద చేస్తారు. రాధేయుడిగా పిలవపడతాడు. ఇతను అద్భుతమైన విలుకాడు. దాన ధర్మాలలో పేరు మోసిన వాడు. ఎన్నో శాపాల బారీ పడ్డ వాడు, తాను సూట పుత్రుడవడం తో ఎన్నో సార్లు అవమానాల బారీన పడ్డ వాడు.. హస్తినాపురి లో రాకుమారుల విద్యాభ్యాసం తర్వాత వారి విద్యా ప్రదర్శన లో అర్జునుణ్ణి మించిన విలుకాడు లేడని గర్విస్తున్నప్పుడు తానూ తన విద్యని ప్రదర్శించి అర్జునుని కన్నా గొప్ప వీరుణ్ణి అని నిరూపించడానికి ముందుకి వచ్చినప్పుడు సూత పుత్రునికి అర్హత లేదన్న మాట వినిపించినప్పుడు, పాండవుల మీద ఉన్న కచ్చ తో దుర్యోధనుడు వెంటనే కర్ణుని అంగ రాజ్యానికి రాజు ని చేస్తాడు. ఈ స్నేహ ప్రకటనకీ, నిండు సభ లో తనకిచ్చిన గౌరవానికి చలించిన కర్ణుడు దుర్యోధనుని స్నేహానికి జీవితం లో ఆఖరి క్షణం దాకా బద్ధుడై వ్యవహరిస్తాడు. దుర్యోధనుడు చేసిన మంచీ, చెడుల్లో భాగమై దుష్ట చతుష్టయం లో ఒకరు గా చెప్పుకోబడతాడు. తాను కుంతీ పుత్రుడనని తెలిసినప్పుడు కూడా, స్వయం గా  తల్లి పాండవులందరికీ అన్నయ్య గా అంగీకరిస్తారని ఆహ్వానించినా,  స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి, దుర్యోధనుని పక్షాన నిలుస్తాడు. భీష్ముడు యుద్ధ భూమి లో నిలిచినంతవరకూ తాను యుద్ధం చేయనని చెప్తాడు.
కృపాచార్యుడు: కృపాచార్యుడు హస్తినాపురి రాకుమారులకే కాక అనేకానేక యాదవులకీ..   కూడా  యుద్ధాలలో ఉపయోగించే అస్త్ర శస్త్రాల జ్ఞానం  నేర్పించాడు.  గౌతమ మహర్షి కుమారుడు శారద్వతుడు అస్త్ర, శస్త్ర శాస్త్రాల్లో నిష్ణాతుడు. ఇంద్రుడు ఇతని నుంచి ఆపత్తు రాగలదని యోచించి శారద్వతుని ఆకర్శించమని జనపది అన్న అప్సరస ని పంపుతాడు. అయితే శారద్వతుడు కొద్ది సమయానికి చలించినా తేరుకుని తన జింక చర్మాన్నే, ధనుర్బాణాలనీ వదిలి పారిపోతాడు. ఈలోగా అతని వీర్యం రెండు భాగాలు గా భూమి మీద పడి కవలలు పుడతారు.  శంతన మహారాజు అడవుల్లో వేటకి వచ్చినప్పుడు ఒక సైనికుడు  ఆడ-మగ కవలల తో బాటు ధనుర్బాణాలనీ చూసి బహుశా ఎవరో ముని పిల్లలని భావించి మహా రాజు దగ్గరకి తీసుకువస్తాడు. శంతనుడు వారిని దయతో చేరదీసి తన బిడ్డలు గా వారిని తనతో బాటు తన రాజ్యానికి తీసుకు వెడతాడు. అందువల్లే వారికి కృప-కృపి అన్న పేర్లు వస్తాయి. అయితే మళ్లీ ముని తిరిగి వచ్చి, తన తపశ్శక్తి ద్వారా తన పిల్లలు శంతన మహారాజు వద్ద ఉన్నట్టు తెలుసుకుని మహారాజుకి అంతా వివరించి కృపుడిని యుద్ద శస్త్ర విద్యా పారంగతుడిని చేస్తాడు. కృపాచార్యుడు శంతనుని తండ్రి  గా భావించడం వల్ల, అలాగే కురు రాజ కుమారులకి రెండు తరాలు గా గురువు అవడం వల్ల హస్తినాపుర సింహాసనానికి బద్ధుడై  కౌరవుల పక్షాన యుద్ధం లో నిలుస్తాడు. ఆయన సోదరి కృపి ద్రోణుని భార్య.
అశ్వత్థామ: ద్రోణుని కొడుకు. కృపి ఇతని తల్లి. పుట్టినప్పుడు ఒక గుఱ్ఱపు (అశ్వం) అరుపు లా అరుస్తూ పుట్టాడని ఇతని పేరు అశ్వత్థాముడని పెట్టాలని అశరీర వాణి చెప్పడం తో అదే పేరు స్థిరమవుతుంది. తండ్రి, మేనమామలు అన్ని రకాల అస్త్ర,శస్త్ర విద్యల్లో నిష్ణాతులు, తండ్రి తనకి తెలిసిన విద్యలన్నీ అశ్వత్థామ కి బోధిస్తాడు. ద్రోణుడు కొడుకుని చాలా ప్రేమిస్తాడు. అయితే ప్రపంచం లో అత్యంత గొప్ప విలుకాడు గా అర్జునిడిని చేస్తానన్న మాట కోసం, తన కొడుకుకి  బ్రహ్మాస్త్రం మాత్రం ప్రయోగించడం  మాత్రమే నేర్పిస్తాడు. విరమించడం నేర్పించడు.  అర్జునునికి మాత్రం బ్రహ్మాస్త్రం గురించి సంపూర్ణ జ్ఞానం ఇస్తాడు.  బ్రహ్మాస్త్రాన్ని ఒక్కసారి సంధించి విరమించక పోతే, అది ప్రయోగించిన చోట పన్నెండేళ్ల క్షామం వస్తుంది. బ్రహ్మాస్త్రాన్ని విరమించడం నేర్పించక పోవడం వెనక చేతిలో అస్త్రం ఉంది కదా అని మళ్లీ ఉపయోగించకుండా, మంచి కార్యానికి మాత్రమే ఒకేసారి ప్రయోగించాలన్నది ద్రోణుని ఉద్ద్యేశం కావచ్చు. ఆ విచక్షణ అర్జునికి మాత్రమే ఉందన్న అభిప్రాయం కూడా కావచ్చు.
వికర్ణుడు : వికర్ణుడు కౌరవులలో ఆఖరి వాడు. (దృతరాష్ట్ర/గాంధారుల  కొడుకు). ద్రౌపది కి నిండు కురు సభ లో  దుర్యోధన, కర్ణ, శకుని ల ఆదేశం/ప్రోత్సాహం తో దుశ్శాసనుడి చేతిలో అవమానం జరుగుతున్నప్పుడు, భీష్మ,ద్రోణ, విదురాది పెద్దవారు ఏమీ అనలేక తలలు వంచుకుని కూర్చున్నపుడు వికర్ణుడు మాత్రమే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు.
సోమ దత్త, భూరి శ్రావులు : సోమ దత్తుడు కురు వంశం వాడే. శంతనునికి తమ్ముడు. అతని కొడుకు భూరిశ్రావుడు. వీరిద్దరూ మహా వీరులు. యుద్ధం లో కౌరవుల పక్షాన నిలుస్తారు.
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)



కృష్ణ కృష్ణ

Tuesday, February 12, 2013

శ్లో: 7: ఇక మన వైపు వీరులిరుగో!

అర్జున విషాద యోగం: ఏడవ శ్లోకము
 అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||

తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)
బ్రాహ్మణోత్తమా ! ఇక మన సైన్యంలో ఉన్న నాయకులూ, సుప్రసిద్ధులూ అయిన వాళ్ళ గురించి కూడా చెబుతాను.
నేపధ్యం:
4,5,6 శ్లోకాలలో పాండవ సేనలోని  యుద్ధవీరుల పట్టీ  దుర్యోధనుడు గురువు ద్రోణాచార్యుని కోసం చదివితే తమ వైపు నిలిచిన వీరుల గురించి తరువాతి శ్లోకాల్లో చెప్తాడు.
ద్రోణునికి కౌరవుల వైపునుండి, పాండవుల వైపు నుండి ఎవరెవరు యుద్ధం లో నుంచున్నారో తెలియక దుర్యోధనుడు ఈ విధం గా ప్రవర చదువుతున్నట్టు మనం  అర్థం చేసుకోకూడదు. యుద్ధ భూమి లో అదిగో పాండవ సేనాని ని చూడండి, ఆయా మహారథులని చూడండి.. మనవైపు వీరందరినీ ఎదిరించి ఓడించడానికి సంసిద్ధులైన మహారథులని, ఇతర వీరులు వీరందరితో కలిసి శతృవులని ఓడిద్దామని ఉత్సాహ పరిచే మాటలు గా మనం చూడాలి.

కృష్ణ కృష్ణ

Sunday, February 10, 2013

శ్లో:4,5,6: పాండవ వీరులు వీరే,...

అర్జున విషాద యోగం: 4,5,6  శ్లోకాలు.

అత్ర శూరా మహేష్వాసాః, భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపద శ్చమహారథః ||
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజ శ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుఙ్గవః ||
యుధామన్యుశ్చ విక్రాన్తః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||
తాత్పర్యం ;

ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులూ, అస్త్ర విద్యానిపుణులూ, శౌర్యంలో భీమార్జున సమానులూ ఉన్నారు. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు. వీళ్ళంతా మహారథులే.
నేపధ్యం:
యుద్ధవీరుల లో మహారథులు, అతిరథులు, రథులు అని భీష్ముడు వర్గీకరించాడు..
మహారథి అంటే అరవై వేల శత్రువులని ఒకేసారి ఎదురించగలిగే వాడని అర్థం.
యుయుధాన సాత్యకి యాదవుడు, యౌద్ధుడు, శ్రీ కృష్ణుని స్నేహితుడు, నమ్మిన బంటు వంటి వాడు.సాత్యకి అర్జునుని వద్ద, అలాగే ద్రోణుని వద్ద కూడా విద్యని అభ్యసించాడు.  ఒకసారి నూటొక్క సార్లు ద్రోణుని బాణాన్ని విరిచి ద్రోణుని ఆశ్చర్య పరిచాడు. శ్రీకృష్ణ రాయబారం లో కృష్ణుని తో ఉన్నవాడు.
విరాటుడు మత్స్య దేశం రాజు,  వీళ్ల రాజ్యం కురు సామ్రాజ్యానికి దక్షిణాన (బహుశా ఇప్పటి రాజస్థాన్) ఉంది.పాండవులు వనవాసం తర్వాత ఏడాది పాటూ అజ్ఞ్యాత వాసం కోసం విరాటుని కొలువునే నమ్ముకున్నారు. ఇక్కడే అతని కొడుకు  ఉత్తర కుమారుడు, ఇంకా కూతురు ఉత్తర అర్జునునికి చేరువ అయ్యారు.గడువు ముగిసిన పిమ్మట అర్జునుని కుమారుడు అభిమన్యునికి ఉత్తరనిచ్చి వివాహం చేయడం వల్ల విరాట రాజు పాండవులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడి, వీరు పాండవుల పక్షాన నిలిచారు.
దృష్ట కేతువు చేది దేశ రాజు  శిశుపాలుని కొడుకు. విలువిద్య లో నిపుణుడు. ఒక అక్షౌహిణికి నాయకుడిగా పాండవుల తరఫున యుద్ధం లో పాల్గొన టానికి వచ్చాడు.  ..కృష్ణుని తండ్రి వసుదేవుని చెల్లెలి కొడుకు శిశుపాలుడు పుట్టుక తో మూడు కన్నులతోనూ, నాలుగు చేతులతోనూ ఉన్నాడు.. అతనిని చంపేవాడు వడిలో కూర్చోపెట్టుకుంటే ఈ అవకారాలన్నీ పోతాయని తెలిసి అతని తల్లి కొడుకుని అందరి చేతికీ ఇచ్చి చూస్తూ ఉండేది. శ్రీ కృష్ణుని వడి లో కూర్చోగానే, అతని అవకరాలన్నీ పోయాయి.అత్త శిశుపాలునికి ప్రాణభిక్ష ని ప్రసాదించమని కృష్ణుని అడగగా, నూరు తప్పుల దాకా క్షమిస్తానని కృష్ణుడు అభయమిచ్చాడు. తర్వాత కృష్ణుడి చేతిలో శిశుపాలుడు హతమయ్యాడు. నకులుడు చేది రాకుమార్తె కరెనుమతి ని పెండ్లాడాడు. వారికి నిరమిత్ర అన్న కుమారుడు కలిగాడు.  అందువల్ల యుద్ధం లో దృష్టకేతువు తమ బావల తరఫున నిలిచాడు.
చేకితానుడు: కేకయ దేశరాకుమారుడు (ద్రుష్ట్యకేతుని కొడుకు)
కాశీరాజు ధర్మ రాజు మామగారు. ఆయన ఇద్దరు కుమార్తెలనూ, యుధిష్టురుడు పెళ్లి చేసుకున్నాడు.
పురుజిత్తు; పాండవుల మేనమామ (కుంతి తమ్ముడు).
కుంతిభోజుడు;   సురుడు అగ్నిసాక్షి గా తన ప్రథమ సంతానాన్ని పిల్లలు లేని కుంతి భోజునికి దత్తత కి ఇస్తానని ప్రమాణం చేస్తాడు. ఆవిధం గా తన పుత్రిక అయిన పృథని కుంతిభోజుడు దత్తు తీసుకుంటాడు. సురుడు వేరెవరో కాడు. వసుదేవుని తండ్రే.  ఆవిధం గా పృథ కుంతి అయింది.
శైభ్యుడు
యుదామన్య, ఉత్తమౌజులు పాంచాల దేశరాకుమారులు.
అభిమన్యుడు ; అభిమన్యుడు సుభద్రకీ, అర్జునునికీ పుట్టిన వాడు. పాండవులు అరణ్య/అజ్ఞాత వాసాలకి వెళ్లినప్పుడు వీరు తమ మేనమామ శ్రీకృష్ణుని ఇంట తల్లితో సహా ఉండిపోయాడు.
ఉప పాండవులు ;ఉప పాండవులు ద్రౌపదీ తనయులు. పాండవులు అరణ్య/అజ్ఞాత వాసాలకి వెళ్లినప్పుడు వీరు తమ మేనమామ దుష్టద్యుమ్నుని ఇంట్లో పెరిగారు.

ఇద్దరూ  కావాల్సిన వారే – మరి వారికి  గొడవలైతే?
మహా భారతం లో ఇద్దరు అన్న దమ్ముల పిల్లల తగాదా లలో, భరత ఖండం లో ఎన్నో దేశాల రాజులు పాండవుల వైపో,కౌరవుల వైపో చేరిపోయారు. ఆ విధంగా చేరడానికి ఎవరి కారణాలు వారివి. కొందరు స్నేహం వల్ల, బాంధవ్యం వల్లనైతే,రాజకీయ కారణాల వల్ల కొందరు, ఆర్ధిక లబ్ది కోసం, మరి కొందరు వారి పగలు తీర్చుకోవడానికి, ఒకవైపు వారితో గల శతృత్వం గురించి కొంతమంది...
మహా భారతం  అత్యంత సంక్లిష్టం గా, ఆసక్తిదాయకం గా, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నిలిచిందంటే  ఇన్ని వందల పాత్రలని తీర్చిదిద్దిన విధానమే. ఏ పాత్ర విశిష్టత దానికుంది. నూటికి నూరు శాతం మంచి/చెడ్డ అయిన పాత్రలు చాలా తక్కువ.

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

Wednesday, February 6, 2013

శ్లో: 3 : అదిగో పాండవ సేనాని ..


అర్జున విషాద యోగం: మూడవ  శ్లోకం
పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్ |వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||
తాత్పర్యం:
ఆచార్యా ! ధీమంతుడైన మీ శిష్యుడు, ద్రుపద పుత్రుడు (ధృష్టద్యుమ్నుడు) వ్యూహం పన్నిన పాండు పుత్రుల (పాండవుల) మహాసైన్యాన్ని చూడండి
నేపధ్యం:
ద్రుపద రాజు చిన్ననాటి స్నేహితుడు ద్రోణుడు,ఇద్దరూ కలిసి చదివారు. ద్రుపదుడు తన మిత్రుడని ద్రోణుడు నమ్మాడు. విద్యాభ్యాసం అయ్యాకా ద్రోణుడు కటిక పేదరికం అనుభవిస్తే, ద్రుపద మహారాజు విలాసవంతమైన జీవితం అనుభవించాడు.మొహమాట పడుతూనే ద్రోణుడు విధిలేని పరిస్థుతులలో సహాయాన్నర్థించి వెడితే, అవమానపరిచాడు.
దానితో ద్రోణుడు కురు రాజకుమారులకు గురువు గా నియమితమయ్యాకా, గురు దక్షిణ సమయం వచ్చేసరికి ద్రుపదుడిని ఓడించి రమ్మని మొదటి సారి కౌరవులని, వారి ప్రయత్నం విఫలం కాగా, పాండవులని పంపాడు.ద్రుపదుడు బందీగా తన ముందు నిలబెట్టబడి ద్రుపద రాజ్యం ఈవిధం గా తనదయ్యాకా, రాజ్యాన్ని  తిరిగి అతనికే ధారపోసి,  స్నేహపూరితం గా వీడ్కోలు తీసుకున్నా, అవమాన భారం తట్టుకోలేక ద్రోణుడిని చంపే కొడుకు కోసం తపస్సు చేయగా, యజ్ఞఫలం గా పుట్టిన వారే ధృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది.
ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని దగ్గరే యుద్ధ విద్యలని అభ్యసించాడు. కౌరవుల సైన్యాధ్యక్షుడు  భీష్మాచార్యుడు కాగా, పాండవ సేన సారథ్యం ధృష్టద్యుమ్నుడు చేపట్టడం లో కృష్ణుని పాత్ర ఉంది.

చిన్న నాటి స్నేహితులు..పెద్దయ్యాకా?
ద్రోణ, ద్రుపదుల కథ మహా భారత కాలం లో ముఖ్య పాత్ర దారులైన  ఒక మహారాజు, మరియు ఒక హస్తినాపుర రాజకుమారుల గురువు గార్ల దవడంతో, కథ దశాబ్దాలు నడిచి మహా  యుద్ధం లో ముగిసింది.
మన నిత్య జీవితం లో మనమూ ఏదో ఒక ఎత్తులో కొంత మంది తో  ద్రోణ పాత్ర, ఇంకొందరితో ద్రుపద పాత్ర పోషిస్తూనే ఉంటాము. చాలా సార్లు నేను గమనించిన విషయం మనలో చాలామంది. చిన్నప్పుడు ఏ అమ్మమ్మ/నాయనమ్మ  గారింటికి వెళ్లినప్పుడు తిరిగిన మిత్రులని సిటీ లో తమ స్నేహ బృందం తో కనపడినప్పుడు వారు ఊర్లో మనల్ని ఆదరించినంత ఆత్మీయత తో ఆదరించలేము.  అలాగే ఒక ఇంజనీరు సహోద్యోగి తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది.అతను చిన్నప్పటి సహాధ్యాయులు  కనీసం తన స్థాయి లో ఉంటేనే చిన్నప్పటి స్నేహాన్ని గుర్తుచేసుకోవడానికి ఇష్టపడతాడు.ఆయన క్లాస్మేట్ ఒక అమ్మాయి టైలర్ గా అత్తవారి ఊర్లో జాకెట్లు కుడుతుందిట.ఇంకొకతను పాన్ డబ్బా పెట్టుకున్నాడట. ఊర్లో పలకరిస్తే, చాలా సిగ్గుపడ్డాడట. అది చెప్పుకుని.. తల గుగుర్పాటు తో విదిలించుకోవడం చూశాను.  మనమందరమూ కూడా జీవితం లో ఎవరో కనీసం ఒక్కరితోనైనా,..ఏదో స్థాయిలో, ఎవరో ఒకరితో ఈ విధమైన తప్పిదం  చేశామా, ఇక ముందు చేస్తామా?అన్నది ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఒకవేళ ఈ విధమైన బలహీనత కి మన స్నేహితులు లోని ఉంటే,.. జాలిపడి క్షమించి, ముందుకెళ్లిపోవాలి తప్ప, మళ్లీ ప్రతీకార ధోరణిని అలవరచుకుంటే ఒక మనశ్శాంతి దక్కినట్టే!!
కృష్ణ కృష్ణ

Tuesday, February 5, 2013

శ్లో: 2: గురువు గారితో ఒక మాట..




అర్జున విషాద యోగం: రెండవ  శ్లోకం
సంజయ ఉవాచ!
దృష్టాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా|
ఆచార్యముపసంగమ్య  రాజా వచన మబ్రవీత్||
తాత్పర్యం:
సంజయుడు  ఈవిధం గా అన్నాడు..
ఆ సమయం లో ఎదురు గా యుద్ధం కోసం సమీకృతమైన పాండవ సైన్యాన్ని చూసి, దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడిని సమీపించి ఈవిధం గా అన్నాడు.
నేపధ్యం:
భీష్మ ద్రోణాదులకి కౌరవులూ, పాండవులూ సమానమే అయినా హస్థినాపుర సింహాసనానికి నిబద్ధులై వారు కౌరవుల పక్షమే నిలిచారు.
మహా భారతం లో ద్రోణాచార్యుని పాత్ర కి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే అది కేవలం కౌరవులకీ, పాండవులకీ, అనేక విధాల యుద్ధ విద్యలు, అస్త్ర శస్త్రాలు నేర్పించి ఒక్కొక్కరినీ,ఒక్కొక్క తరహా ఆయుధం/శైలి లో నేర్పరులు చేయడం వల్ల మాత్రమే కాదు.
చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద రాజు తో పరాభవింపబడి, తిరిగి తన శిష్యులతో అతని మదమణుస్తూనే  మళ్లీ ద్రుపదుడిలో ఇంకొక కొత్త పగ కి అంకురార్పణ చేయడం, దుష్టద్యుమ్నుని, మరియు ద్రౌపదుల జననం జరగడానికి కారణమవడం వల్ల కూడా. అలాగే అభిమన్యుని మరణానికి పద్మవ్యూహ రచన ద్వారా కారణ భూతమవడం వల్ల, ఇంకా అశ్వత్థామ వల్ల ఉప పాండవుల వధ వల్ల కూడా.
ద్రోణుని పాత్ర లో నీలి ఛాయల వల్ల తప్ప దేశ చరిత్ర లో గొప్ప గురువుల లో ఒకరాయన. (అర్జునుని అందరికన్నా గొప్ప విలువిద్యాకారుడిని చేయడం కోసం ఏకలవ్యుని కుడి బొటన వేలు గురుదక్షిణ గా అడగడం, కర్ణునికి సూత పుత్రుడన్న కారణం తో విద్య నేర్పించక పోవడం, అలాగే అర్జునికి,తన కొడుకు అశ్వత్థామ కీ విలు విద్య లో కిటుకులు నేర్పడం లో చూపించిన అసమానత...ల్లాంటివి)
ఈనాటికీ భారత  దేశ ప్రభుత్వం క్రీడల్లో ఉత్తమ కోచ్ లకి ఇచ్చే మెడల్ పేరు ద్రోణాచార్య అవార్డ్..
నా సందేహాలు..
ద్రోణాచార్యుని మీద వికీ పేజీ లో The Supreme Court of India also criticized the act of Droṇācārya as unethical upholding everyone's right to knowledge. అని ఉంది. ఇది నిజమా? వేలాది సంవత్సరాల క్రితపు ఇతిహాసం లో పాత్ర తీరుని సుప్రీం కోర్ట్ విమర్శించాల్సిన అవసరమేమొచ్చింది?
ఒకటా రెండా? పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం. పదకొండు అక్షౌహిణులు కౌరవుల పక్క అయితే, ఏడు అక్షౌహిణుల సైన్యం పాండవుల పక్క!   ఒక్కో అక్షౌహిణి లో 21,870 రథాలు, అన్నే సంఖ్యలో  ఏనుగులు, 65610 మందితో అశ్వ దళం, కాల్బలం ఇంకో 109350 మందితో..  ఆర్యావర్తం లో తటస్థులు గా నిలిచిన కొన్ని రాజ్యాల వారు తప్ప, అంత పెద్ద సైన్యాలు ఇరువైపులా నిలిచి ఉన్నప్పుడు దాదాపు నేలే ఈనినట్లు అనిపిస్తుందేమో..
దాదాపు నాలుగు లక్షల రథాలు,ఏనుగులు.. దాదాపు పదకొండు లక్షల అశ్వ దళం, పందొమ్మిది లక్షల మంది కాల్బలం..   కాల్బలం కొద్దిగా నమ్మదగినట్లున్నా, మిగిలిన సంఖ్యలు కొద్దిగా అతిశయోక్తి గా అనిపిస్తుంది నాకు. బహుశా ప్రక్షిప్తమేమో?
ఒకవేళ ఉన్నా  అంత పెద్ద సైన్యము స్థావరాలేర్పరచుకోవాలంటే కురుక్షేత్రమంత చిన్న ప్రదేశం లో అది సాధ్యమా? నాలుగు లక్షల ఏనుగులు, రథాలు అంటే ప్రపంచం మొత్తమైనా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.
కృష్ణ కృష్ణ.

Monday, February 4, 2013

శ్లో: 1: క్షేత్రే క్షేత్రే ధర్మం కురు!



అర్జున విషాద యోగం: మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ!
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ, కిమ కుర్వతి సంజయ?

తాత్పర్యం:
ధృతరాష్ట్రుడు ఈవిధం గా అన్నాడు..
సంజయా! ధర్మ క్షేత్రమైన కురు క్షేత్రం లో (యుద్ధానికి సంసిద్ధులై) చేరిన నా కొడుకులూ పాండవులూ, ఏం చేస్తున్నారు?

నేపధ్యం:
ఆర్యావర్తం లోనే అతి పెద్ద యుద్ధం..దాదాపు ప్రతొక్క రాజ్యం నుండీ రాజులు తమ సైన్యాలతో కౌరవుల వైపో, పాండవుల వైపో  ఈ మహా యుద్ధం లో పాల్గొన టానికి  వచ్చి కురుక్షేత్రం లో మోహరించి ఉన్నారు. హస్తినాపురి సింహాసనం పైన వృద్ధ కురు చక్రవర్తి ధృతరాష్ట్రుడు వ్యాకులత తో, అసహాయత తో కూర్చుని తన ఇష్టాయిష్టాలతో, సలహా సంప్రదింపులతో పని లేకుండా జరుగుతున్న ఈ సంగ్రామం గురించి సంజయుడిని విచారిస్తున్నాడు. ఆయన పుట్టు గుడ్డి. అందువల్లే  ఆయన ముందు తరం వాడైన కురు వంశం లో అందరికన్నా పెద్దవాడైన భీష్మా చార్యుడు సైతం కౌరవుల పక్షం వహించడమే కాకుండా, సైన్యాధ్యక్షుడి బాధ్యత తీసుకుని యుద్ధభూమి లో రథమెక్కి ధనుర్బాణాలను చేత బూని నిలబడగా, ధృతరాష్ట్రుడు మాత్రం రాజ భవనం లో ఉండిపోయాడు..ఆయన అంతరంగిక సలహాదారు/రథ సారథి అయిన సంజయుడు మాత్రం మహారాజుకి యుద్ధ భూమి లో ఘటనలని ‘ఆంఖో దేఖా హాల్/లైవ్ ‘ గా కళ్ళకి కట్టినట్టుగా వివరించే బాధ్యత తీసుకున్నాడు.
సంజయుడికి దివ్య దృష్టి ఉండటం వల్ల యుద్ధం లో జరిగినది జరిగినట్లు గా చెప్పగలిగాడని ప్రతీతి.  దివ్య దృష్టి తో చూసి చెప్పాడా లేక చారులు ఎప్పటికప్పుడు ఇస్తున్న సమాచారాన్ని మహారాజుకి చెప్పాడా అన్నది పక్కకి పెడితే.. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఒక్కో కొడుకూ పోయిన వివరాలూ, కురు వంశ ప్రముఖులు, గురువులు, బంధువుల మరణాల వివరాలూ, అబ్బా.. ఏ వార్త చెప్పినా విషాద వార్తే..  రెండు వైపులా తనవాళ్ళే కదా ఎంతైనా.. అది చాలా బరువైన బాధ్యత. మహాభారత సంగ్రామం లో పాల్గొన్న వీరులే కాదు.. భారత చరిత్ర లో వేలాది ఏళ్లు గా ఎందరో గొప్ప గొప్ప వాళ్లు, చాలా గొప్ప కార్యాలకోసం  అసువులు బాసిన వాళ్ల పేర్లు చరిత్ర పుటల్లో ఎక్కడో కలిసిపోగా, సంజయుడు ఈ విధం గా భగవద్గీత లో పాత్ర ద్వారా అమరుడైనట్లే..
పిట్టకథ..
నా చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఒక మహారాణీ గారు ఎప్పుడూ ప్రజల సేవ, పాలన విషయాల్లో పడి కొట్టుకుంటూ ప్రజల సమస్యలని తీర్చడం లో, క్షణం తీరిక లేని జీవితం గడుపుతూ ఉండేవారట. ఆవిడకి ధర్మ చింతనకి సమయమే లేదట. అందరూ ‘వయసు మళ్ళుతోంది.. కొద్దిగా ధర్మం గురించి ఆలోచించు..’ అని పోరిన మీదట, ఆవిడ గీతా ప్రవచనం చేయించుకుందామని ఒక గురువు గారిని పిలిపించి సమయం కేటాయించుకుంది.
ప్రవచన సమయానికి ఏదో ఒక సమస్య తలెత్తడంతో ఆవిడ ఏ ఒక్కరోజూ గురువు గారి గీతా పఠనం వినలేక పోయింది. మరి ఓరోజు కృత నిశ్చయం తో ఆవిడ రాజ భటులతో ఎంతటి అవాంతరం వచ్చినా లోపలికి రానివ్వకూడదని ఆజ్ఞ జారీ చేసి మరీ కూర్చుందిట. అప్పుడు గురువు గారు.. ‘ధర్మ క్షేత్రే కురు క్షేత్రే..’ అని ఒక చిన్న రాగాలాపన చేసి ‘సమవేతా.. ‘ అనబోయేలోపల  ఆవిడ.. ‘ఆగండి గురువు గారూ.. నాకు గీతా సారం అర్థం అయింది.. ధన్యవాదాలు! ‘ అని లేచిందట..
‘పది సంవత్సరాలు అవపోశన పట్టిన నాకే గీతా సారం అర్థంపూర్తి గా కాలేదు. ఇంకా ఎంతో ఉంది అర్థమవనిది అనుకుంటే.. రెండు ముక్కలకి మీకేమర్థమయిందని? ‘ అని ఆయన సందేహం వెలిబుచ్చితే.. ఆవిడ ఇలా అందట..
‘గురువు గారూ.. నా పనులు ఆపుకుని, నా మీద ఆధారపడ్డ వారిని పక్కకి పెట్టి ఈ ప్రవచానానికి కూర్చున్నందుకు నాకు చాలా మనస్సంతా అలజడి గా ఉంది. ఈలోగా..మీరన్న రెండు మాటలు నాకు కర్తవ్య బోధ చేశాయి..’ అందట.
‘అవునా? ఏమర్థమయింది. రెండు ముక్కల్లో?’ అని హేళన గా అన్న గురువు గారితో.. ఆవిడ.. ఇలా అందట..’క్షేత్రే, క్షేత్రే ధర్మం కురు!’  (అంటే ప్రతి క్షేత్రం లోనూ.. ధర్మ పరిపాలన చేయి.. అని) నేను చేస్తున్నది అదే కదా?’

కృష్ణ కృష్ణ

Sunday, February 3, 2013

భగవద్గీత గురించి రాసేంతటి దాన్నా?


భగవద్గీత గురించి వ్రాయాలంటే చాలా మేధావులయుండాలని, మహా భక్తులయుండాలనీ, నాకు  చిన్నప్పటి నుండీ ఒక గట్టి నమ్మకం ఉండేది. వేదశాస్త్రాలన్నీ అవపోశన పట్టిన వారికి తప్ప, మామూలు మామూలు వారికి ఈ మహద్గ్రంథాన్ని గురించి మాట్లాడే ధైర్యం చాలదనీ ఉండేది. కోట్లాది జనాభాకి ఒక మార్గదర్శి అయిన ఈ పవిత్ర గ్రంథం గురించి నిజంగా మనమెంత తెలుసుకోగలుగుతున్నాం? అందులోని అంశాలని ఎంతవరకూ ఆచరించగలుగుతున్నాం?  ఈ గ్రంథం కేవలం వయసు మళ్లాకా, బాధ్యతలన్నీ తీరిపోయాకా తోచుబడికో, లేక ఆధ్యాత్మచింతనకోసమో చదువుకునేందుకా? లేక దేవుడి గూటిలో ఉంచి నమస్కరించుకునేందుకా?  ఈ రెంటికీ మాత్రమే కాదని నా నమ్మకం.

చిన్నప్పుడు పోటీ పరీక్షల కోసం, రెండధ్యాయాలు బట్టీ వేసి తాత్పర్యాన్ని చదివి చాలా అర్థమైందని భ్రమ లో ఉండేదాన్ని. కొన్నాళ్లకి అలాగ అనుకున్నందుకు సిగ్గు గా అనిపించేది. ఇప్పడికీ ఎంతర్థమయిందో తెలియదు.

హాస్టల్ కి వెళ్లేటప్పుడు 'అప్పుడప్పుడూ..' చదువుకొమ్మని చేతిలో మా నాన్నగారు పెట్టినప్పుడు నిజంగా ఒకటి రెండు సార్లకి మించి చదవలేదు. తర్వాత, ఒక భగవంతుడి విగ్రహం లాగా, గీత కూడా పూజలందుకోవడమే తప్ప, చదవడమే తటస్థించలేదు.

కార్లో వెళ్తున్నప్పుడు ఘంటసాల వారి గొంతులో కొన్ని శ్లోకాలని వినడం..   మంచికీ, చెడుకీ, ఎవరైనా ఇంటికి వెళ్లినప్పుడు విన్నా, పూర్తి శ్రద్ధ తో మాత్రం కాదు.

ఇన్నాళ్లకి మళ్లీ గీతా  పఠనం వైపుకి నా మనస్సు మళ్లింది.

భగవద్గీత మీద గూగుల్ లో శోధిస్తే దొరికే లక్షలాది లంకెలు చూసి కూడా ఇంకో లంకెని జత చేరుస్తున్నానంటే కారణం, నా పఠనానుభవాలని గ్రంథస్థపరచాలన్న కోరిక, అలాగే నా అవగాహనా లోపాలని, అనుభవ రాహిత్యాన్నీ, అజ్ఞానాన్నీ నా బ్లాగు చదివిన వారు సరిదిద్దుతారనీ, సందేహ నివృత్తి చేసుకోవచ్చనీ ఆశ..

(మిగతాది తదుపరి టపా లో..)
కృష్ణ-కృష్ణ..