Wednesday, April 10, 2013

శ్లో:19. పాండవ సైన్యం బలం ఎక్కువా? కౌరవులదా? భారత యుద్ధం లో ఆంధ్రులు ఎవరి పక్షాన నిలిచారు?

అర్జున విషాద యోగం : శ్లో. 19

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||

తాత్పర్యం:

ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి.

నేపధ్యం:

భీష్మాచార్యుడు శంఖం పూరించగానే, కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.  మరి అదే పాండవ వీరుల శంఖ ధ్వనులు, కౌరవుల గుండెలని బ్రద్దలు చేశాయి అనడం లో పాండవుల సైన్యాన్ని చూసి కౌరవులు భయపడ్డారు అని చెప్పడం లో వ్యాసుడు పాండవుల సైన్యమే బలమైనదని చెప్తున్నాడనిపిస్తుంది.

నిజానికి, కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంది. పాండవుల వైపు కేవలం ఏడు అక్షౌహిణులే ఉన్నారు. భీష్మ,ద్రోణ,కృప,శల్యాది గొప్ప వీరులు అంటే కుటుంబం, గురువులు  కౌరవుల వైపే ఉన్నారు.  అయినా కౌరవులు పాండవుల శక్తి ని చూసి భయపడ్డారంటే,  చాలా కారణాలున్నాయి.


ముందుగా కౌరవుల బలం చూద్దాం..

కౌరవుల పదకొండు అక్షౌహిణులకు, కృపాచార్యుడు, ద్రోణుడు, శల్యుడు, జయధద్రుడు (సింధురాజు), సుదక్షినుడు(కాభోజ రాజు), కృతవర్ముడు, అశ్వత్థామ,కర్ణుడు, భూరుశ్రావుడు, శకుని(సువల రాజు), ఇంకా బాహ్లీకుడు అధిపతులు.

ఇక కౌరవుల వైపు పోరాడిన వారిలో కాంభోజ, శక,ఖస, శల్వ, మత్స్య రాజులు, అలాగే మధ్య దేశ ప్రాంతపు కురు వంశ రాజులు మ్లేచ్ఛ, పుళింద,ద్రవిడ, ఆంద్ర, కంచీ, భోజ, అవంతి, కోసల, రాక్షస, ప్రజ్ఞ్యోతిష, త్రిగర్త రాజులు ఉన్నారు.

ఇక వీరుల విషయానికొస్తే  శారద్వతుడు, వివింగ్సతి, బృహద్వలుడు, సౌమదత్తి, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, కాంభోజ రాజు, జయధద్రుడు, శకుని, పురుమిత్రుడు, దుర్మర్షునుడు, పురుమిత్రుడు, శకుని, భూరిశ్రావుడు,  ఇలాగ చాలా మంది ఉన్నారు.

ఉద్యోగ పర్వం లో భీష్ముడు తమ సైన్యాన్ని వర్ణిస్తూ కౌరవ వీరులని క్రింది విధం గా పేర్కొన్నాడు.

రథులు, అతిరథులు, మహారథులు..
రథులు:

దుర్యోధన, దుశ్శాసనులు, కాంభోజ రాజు సుధక్షిణుడు,మహిష్మతుడు,నీలుడు,విందానువిందులు అవంతీ నగర రాజులు, అన్నదమ్ములు), త్రిగర్త రాకుమారులు ఐదుగురు, దుర్యోధనుని కొడుకు లక్ష్మణుడు, దుశ్శాసనుని కొడుకు, దండధరుడు, కోసల రాజు వ్రిహద్వాలుడు, శకుని, గంధర్వ రాజులు అచలుడు మరియువృషుడు
అతిరథులు: భోజరాజు కృతవర్మ, శల్యుడు, బాహ్లీకుడు
మహారథులు :అశ్వత్థామ,వృషసేనుడు (కర్ణుని కొడుకు) , సత్యవాన్ (కౌరవుల సేనాని), రాక్షస రాజు, ఆలంభూషణుడు
ద్వి రథులు : సింధురాజు జయదద్రుడు
అర్థరథుడు : కర్ణుడు (దీనికి సహజ కవచ కుండలాలు కోల్పోవడం, వివిధ శాపాలు.. కారణాలు గా చెప్తాడు)


పాండవులు వైపు?

ద్రుపదుడు, విరాట రాజు, ద్రుష్ట్యద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, ఇంకా చేకితానుడు, భీముడు పాండవుల ఏడు అక్షౌహిణులకి అధిపతులు గా వ్యవహరించగా

పాండవుల వైపు, పాంచాల, ప్రభద్రక రాజులు, కేకయ దేశపు ఐదుగురు అన్నదమ్ములు, రాక్షస రాజు ఘటోత్కచుడు, సాత్యకి, ద్రుష్ట్యకేతు, ఉత్తమౌజుడు, చేకితానుడువంటి రాజులు నిలబడ్డారు.

వీరి వైపు వీరులు..
అర్థరథుడు :క్షత్రధర్ముడు (ద్రుష్టద్యుమ్నుని కొడుకు)
రథులు : ధర్మరాజు, నకుల సహదేవులు, ఉత్తరకుమారుడు,శిఖండి, క్షత్రదేవుడు, కాశికుడు, సుకుమారుడు, నీలుడు, సూర్యదత్తుడు, శంఖుడు (మదిరస్వుడు), చిత్రయుధుడు, చేకితానుడు, సత్యద్రుతుడు, వ్యాఘ్రదత్తుడు, చంద్రసేనుడు, కస్యుడు, పాండ్య రాజు,
ఎనిమిది (అష్ట)రథులు : భీముడు, సత్యజిత్తు (ద్రుపదుని కొడుకు)(సత్యజిత్తుని ఒకసారి భీష్ముడు ఎనిమిది X రథుడు అంటూనే మళ్లీ అతిరథుడు అంటాడు. కాబట్టి అతిరథుడేనని లెక్కలోకి తీసుకోవచ్చు
అతిరథులు: ద్రుష్టద్యుమ్నుడు, శ్రేణిమతుడు, కృష్ణుడు, కుంతిభోజుడు,
మహారథులు : ఉప పాండవులు, ద్రుపదుడు, విరాట రాజు, ధృష్టకేతు(శిశుపాలుని కొడుకు) , జయంత, అమితౌజులు, సత్యజిత్తు,అజ, భోజులు, వర్ధక్షేమి, ధృడధన్వుడు, రోచమనుడు,

భీష్ముడి వర్గీకరణ లో లోపాలున్నాయా?

భగవాన్ శ్రీ కృష్ణుడు పాండవుల వైపు ఉండటం వల్ల, అలాగే వ్యాసుడు ధర్మం పాండవుల పక్షాన ఉందని నమ్మడం వల్ల పదే పదే మహా భారతం లో కౌరవులు పాండవుల బలం చూసి జడిశారని రాసినట్లనిపిస్తుంది.  బలాబలాల చర్చ చూసినప్పుడు భీష్ముని వర్గీకరణ లో విచక్షణ కొద్దిగా ప్రశ్నార్థకం గా అనిపిస్తుంది.
ఎందుకంటే.. మచ్చుకి..

౧. ఉపపాండవులు మహారథులా? ఏ విధం గా ఆయన ఇలాగ నిర్ణయించారు? వాళ్లు చేసిన ఒక చిన్న యుద్ధమేది? తల్లిదండ్రులు వనవాసానికి వెళ్తే తాతగారింట పెరిగారు. బహుశా మేనమామల దగ్గర నేర్చుకుని ఉండవచ్చు. వారే రథులూ, అతిరథులున్నూ.
౨. ద్రుపదుడు ఒక మహారథి? స్నేహితుడి శిష్యుల చేతిలో ఓడిపోయినవాడు? పైగా వృద్ధుడు ( ఆరోజుల్లో మనుషుల బలం వేరు గా ఉంటే ఉండవచ్చు అనే వాదన ఉండనే ఉంది.. అలాగే ఒకప్పుడు యవ్వనం లో మహారథి అయ్యుండవచ్చు..)
౩. విరాట రాజు మహారథా! బావమరది కీచకుని దురాగతాలు చూసీ చూడనట్లు వదిలేసిన వాడు..
౪. కర్ణుడు అర్థ రథి? భీష్ముడు చేసిన వాదనా పరం గా సహజ కవచ కుండలాలు కోల్పోవడం, శాపాలు.. కారణాలు అయితే, మిగిలిన మహా రథుల పేర్లు చూస్తే, పక్షపాత ధోరణి తప్పక కనిపిస్తుంది.

ఆంధ్రులు?
అయితే మనం కౌరవుల పక్షం లో నిలిచామన్న మాట.


తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ : THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

Sunday, March 31, 2013

శ్లో 15-18 - కథానాయకులు, అయినా వీరికి పేరు అంతంత మాత్రమే..

అర్జున విషాద యోగం : శ్లో. 15-18
 పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకుల స్సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ ||
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః ||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ||

తాత్పర్యం:
శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం ఊదారు. ధర్మరాజు అనంతవిజయం, నకుల సహదేవులు సుఘోషమణిపుష్పకాలూ పూరించారు. కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలు అన్నివైపులా ఊదారు.

నేపధ్యం:
కౌరవ వీరుల యుద్ధ భేరి తర్వాత ఇటు పాండవుల నుండి కూడా తామూ యుద్ధ ప్రారంభ సంకేతం గా తమ తమ శంఖాలను పూరించారు. మహాభారత గ్రంథం లో అతి ముఖ్యులైన పాండవుల్లో నకుల సహదేవుల ప్రసక్తి  పాండవుల తో సమిష్టి గా తప్ప ప్రత్యేకం గా వారి పాత్రల ఔచిత్యం,ప్రత్యేకతలు  ప్రజాదరణ పొందిన ఉపకథల్లో అంతగా కనిపించదు. మహా భారతం లో నకులుడు, సహదేవుడు కొన్ని చోట్ల తమ అభిప్రాయాలని, నీతి వాక్యాలని, అలాగే ఒక్కోసారి ఆవేశపూరితమైన చిన్న ప్రసంగాలు చేసినా, అవి నాకెందుకో అతికించినట్లు అనిపించాయి. అక్కడక్కడా వారి భార్యలు, పిల్లల వివరాలు, అలాగే వారు చేసిన యుద్ధాలలో తప్ప వారి ప్రస్తావన ఎక్కడా దాదాపు ఒంటరి గా లేదు. (ఉపపాండవుల మరణ సమయం లో, అలాగే భీష్మాచార్యుని నిర్యాణ సమయం లో మాత్రం కొద్దిగా వారి పాత్రల ప్రాముఖ్యత కనిపించింది.) భారతం లో నకుల, సహదేవుల పాత్ర భీష్మ పర్వం దాకా రాసే ప్రయత్నం ఇక్కడ చేశాను.

పుట్టుక, బాల్యం: పాండురాజు రెండవ భార్య మాద్రీ దేవి (మద్ర దేశ రాకుమారి, శల్యుని సోదరి) కి అశ్వినీ దేవతల ద్వారా నియోగం వల్ల కలిగిన కుమారులు వీరు. ఇద్దరూ కవలలు.  పాండురాజు మరణం తర్వాత మాద్రి  తన ఇద్దరు పిల్లలని,  కుంతికి అప్పగించి భర్త తో సతీ సహగమనం చేస్తుంది.  కుంతి తన ముగ్గురు పిల్లల తో సమానం గా, నిజానికి ఇంకా ఎక్కువ ప్రేమ తో వారిని చూసుకుంటుంది.  పంచపాండవులు గా కుంతి కి ముద్దు బిడ్డలు గా ఇద్దరూ పెరుగుతారు. అర్జునుడు ద్రౌపది ని స్వయంవరం లో మత్స్యయంత్రాన్ని ఛేదించి సాధించుకుని వచ్చినప్పుడు, కుంతి ద్రౌపది వివాహం ఐదుగురు పాండవులతోనూ జరిపిస్తుంది. వీరిద్దరూ పెద్దన్నయ్య అయిన ధర్మరాజు మాట జవదాటకుండా, పాండవులందరిదీ ఒకటే మాట, ఒకటే బాట అన్నట్టు గా జీవితాంతం నిలబడ్డారు.
నకులుడు :
తామ్ర వర్ణపు వాడు, సౌమ్యం గా మాట్లాడతాడు. యుద్ధ విద్యల్లో నిష్ణాతుడు, పాండవులందరిలోనూ అందగాడు. సుఘోష అనే శంఖం అతనిది. కృపాచార్య, ద్రోణాచార్యుల దగ్గర అన్ని యుద్ధ విద్యలూ నేర్చుకున్నాడు. అన్నింటా ప్రావీణ్యం ఉన్నా, కత్తి యుద్ధం లో బాగా రాణించాడు. అలాగే నకులుడు అతిరథుడు. రథాన్ని యుద్ధం లో తోలడం లో నిపుణుడు.
శతనికుడు (ఒక రాజర్షి పేరు) ద్రౌపది ద్వారా ఇతని కొడుకు.  చేది రాజకుమారి కరెనుమతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వీరికి నిరమిత్రుడు అనే కొడుకు పుట్టాడు.
లక్క ఇంటి దహనం తర్వాత అజ్ఞాతం లోకి వెళ్లిన పాండవులు ద్రౌపది స్వయవరం తర్వాత బయట పడి, హస్తినాపురానికి తిరిగి వచ్చాకా, ఖాండవ ప్రస్థం తమ రాజ్యం గా పొందుతారు. పెద్దవాడైన యుధిష్టరుడు రాజు అవగా,  ఖాండవ ప్రస్థం లో పశ్చిమ భాగపు పరిపాలనా భారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. 
ఖాండవ ప్రస్థాన్ని, మయుడు అతిలోక సౌందర్యం తో తీర్చిదిద్దాకా, రాజ్యం సుభిక్షం గా వర్ధిల్లుతూ ఉండగా, యుధిష్టరుడు రాజసూయ యాగం చేస్తాడు. దానిలో భాగం గా నకులుడు తన ఆధీనం లో ఉన్న పశ్చిమ భాగం నుండి, ఇంకా ముందుకి సైన్యాన్ని తీసుకుని బయలు దేరి అనేక రాజ్యాలని జయించి, ధర్మరాజు ఆధిపత్యాన్ని అంగీకరించేలా చేస్తాడు.
నకులుని దిగ్విజయ యాత్ర:
నకులుడు పడమటి దిక్కుకి సైన్యం తో బయలుదేరి ముందు గా రోహితక పర్వత రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ కార్తికేయుడు నకులుని ఆధిపత్యం ఒప్పుకుని కప్పం కట్టిన తర్వాత మత్తమ్యూరక దేశపు రాజుతో యుద్ధం చేసి గెలిచి,  ఎడారి రాజ్యాలకి చేరుకుంటాడు.  శైరశకం, మహేత్తము అన్న రాజ్యాలని జయించి ఆక్రోశుడితో యుద్ధం చేసి గెలిచి, దశర్ణ, శివి, త్రిగర్త, అమ్వస్త, మాల్వ, కర్ణాట (ఐదు తెగలు), మధ్యమకేయ, వత్తధన తెగలని ఆక్రమించి, ఉత్సవ,సంకేత తెగలని (మ్లేచ్ఛ తెగలు) జయించి, సముద్ర తీరాన ఉన్న గ్రామణీయ తెగనీ, అలాగే సరస్వతీ నదీ తీరాన ఉన్న శూద్ర,అభీర తెగలనీ, తీర ప్రాంతాల్లో చేపలు పట్టుకునే తెగల వారందరినీ,కొండ జాతుల వారందరినీ, అలాగే ఐదు నదుల దేశాన్ని (పంజాబ్?) అమర పర్వతం, ఉత్తరాయోతిష్టమనే దేశాన్ని, దివ్యకూటమనే నగరాన్ని, ద్వారపాలమనే తెగనీ కూడా తమ ఆధీనం లోకి తెచ్చుకుని, అలాగే రామతులు,మరియు హరనూణులని బల ప్రయోగం తో గెలిచి, వారి రాజ్యాల్లో ఉంటూనే, వసుదేవునికి రాయబారం పంపగా, నకులుని (పాండవుల) ఆయన యాదవులందరి తరఫునా పాండవ రాజుల ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ సమాధానం పంపుతారు. అక్కడి నుండి తమ అమ్మమ్మగారి (మద్ర రాజుల) శాకల రాజ్యానికి  వెళ్లి తన మేనమామ శల్య మహారాజు ఆతిథ్యాన్ని పొంది, వారి నుంచి కూడా  తమ దిగ్విజయ యాత్ర కి మద్దతు, ఆధిపత్య అంగీకారాన్ని, ఆభరణాలు,మణులు,ఇంకా ఇతర సంపదలని స్వీకరించి, అక్కడ నుండి పడమటి తీర ప్రాంతపు మ్లేచ్చుల ఆధిపత్యాన్ని తగ్గించి, అలాగే ఆటవిక జాతులైన పల్హవుల ధాటి ని తగ్గించి, కిరాట, యవన, శకులని కూడా తన ఆధీనం లోకి తెచ్చుకుని వారిచ్చిన కప్పం/బహుమానాలతో తమ నగరానికి తిరిగి వస్తాడు.
అందరి దిగ్విజయ యాత్ర ముగిశాకా, ధర్మరాజు హస్తినాపురి కి భీష్మ ద్రోణాదులని తోడ్కొని రమ్మని పంపుతాడు.
అరణ్య వాసం, అజ్ఞాత వాసం..
అన్న, ధర్మ రాజు జూదం లో  రాజ్యాన్నీ, సర్వసంపదలనీ, అన్నదమ్ములందరినీ, చివరకి తమ పట్టమహిషి ద్రౌపది నీ ఓడినప్పుడు, భీమార్జునులు అన్నగారి పట్ల కొద్దిపాటి కినుక  వహించినట్లు కనిపించినా, ఎక్కడా నకుల సహదేవులు పల్లెత్తు మాట అన్నట్టు కనిపించదు. అయితే భీమార్జునులు చేసినట్లు గానే వీరూ యుద్ధ భూమిలో కౌరవులకి బుద్ధి చెప్తామని ప్రతిజ్ఞలు చేస్తారు.
నకులుడు అరణ్య వాసానికి, హస్తినాపురి ని వదిలి వెళ్లేటప్పుడు దుమ్ము తో తన ముఖం కప్పుకుని.. బాధ గా వెళ్లిపోతాడు. అజ్ఞాత వాసానికి గ్రాంతికుడు అనే పేరు తో విరాటరాజు కొలువు లో గుఱ్ఱాల సంరక్షకుని గా ఉంటాడు. పూర్వం యుదిష్టరుని ఆస్థానం లో కూడా ఇదే పని చేశాను అని చెప్పుకుంటాడు.
ఉపప్లావ్య వనం లో రాయబారాలన్నీ ముగిసి యుద్ధం ప్రారంభమవ్వాలని చూస్తున్న వారిలో నకులుడొకడు.  
సహదేవుడు..
అన్న నకులుని లాగే కత్తి యుద్ధం లో ప్రావీణ్యుడు, రథం నడపటం లో నిపుణుడు, నీతిశాస్త్రం చదివినవాడు.  మణిపుష్పకం అనే శంఖం అతనిది.
ద్రౌపది ద్వారా సహదేవునికి శ్రుతకర్ముడు/శ్రుత సేనుడు అన్న కొడుకు కలుగుతాడు., (అతను కృతిక నక్షత్రం లో పుట్టాడు కాబట్టి కార్తికేయుని పేరు పెట్టుకుంటాడు.
మద్ర రాజకుమార్తె విజయ ద్యుతిమతుడి కుమార్తె ని స్వయంవరం లో పెళ్లాడతాదు.
వీరి కొడుకు సుహోత్రుడు.
సహదేవుని దిగ్విజయ యాత్ర:
సహదేవుడు ఖాండవ ప్రస్థం లో దక్షిణభాగానికి రాజు.
.శూరసేనుడిని జయించి మత్స్య రాజ్యాన్ని, తర్వాత దంతవక్రుడిని జయించి అతని చేత కప్పం కట్టించుకుని తిరిగి అతనిని రాజు గా నియమించి, సుకుమారుడు, సుమిత్రుడు, మొదలైన వారిని జయిస్తూ మత్స్యులని, పతచరులని కూడా ఒక్కొక్కరినీ జయిస్తూ, నిశధరాజుని ఓడించి, ఇంకా ముందుకెళ్లి గోశ్రింగ పర్వతాన్ని తన ఆధీనం లోకి తెచ్చుకుంటాడు. నవరాష్ట్ర రాజ్యాన్ని జయించి కుంతిభోజుని రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడ కుంతిభోజుడు సాదరం గా సహదేవునికి ఆహ్వానం పలికి చర్మన్వతి నదీ తీరం దాకా సాగనంపుతాడు. అక్కడ జాంబకుని కొడుకు తో యుద్ధం చేసి గెలిచి ఇంకా దక్షిణం దిక్కున ముందుకు వెళ్తూ,శకులు, వివిధ చిన్న తెగల వారిని జయిస్తూ నర్మదా తీరానికి చేరుకుంటాడు. అవంతి రాజులు వింద, అనువిందులని జయించి, భోజకత రాజు భీష్మకుడిని రెండు రోజుల పాటు జరిగిన యుద్ధం లో జయించి, కోసల రాజ్యానికి చేరుకుంటాడు. కోసల రాజుని జయించి, వెన్వ నదీ తీరం లో చిన్న చిన్న రాజ్యాలని జయించి, కంటారకులని, తూర్పు కోసల రాజులని, నటకేయులని, హేరంవకులని, మరుధరాజుని, ముంజగ్రామ రాజుని, నచిన, అర్వుక రాజులని, ఆ ప్రాంతపు అటవీ జాతులవారిని జయించి, కప్పం వసూలు చేసి, వాతాధిప,పుళింద రాజులనీ ఓడించి, ఇంకా దక్షిణ ముఖం గా వెళ్తూ,పాన్ద్ర్య రాజుని ఒక్క రోజులో ఓడించి  కిష్కింధ గుహల్లోని వానర రాజులు మైంద, ద్వివిద రాజులని ఏడు రోజుల యుద్ధం లో ఓడించి వారినుండి కూడా కప్పం వసూలు చేసి, మహిష్మతి నగరం యొక్క రాజు నీలుని తో యుద్ధానికి వస్తాడు. అయితే అగ్ని నీలుని రాజ్యాన్ని సురక్షితం గా ఉంచుతుంది.అయితే నకులుడు అగ్ని దేవుని ప్రార్థించి అగ్ని చల్లారేలా చేసి, నీలుని సమీపించి కప్పం వసూలు చేసుకుంటాడు. (ఇక్కడ మహా భారతం లో (సభా పర్వం – దిగ్విజయ పర్వం ) అగ్ని దేవునితో నకులుని సంభాషణలు సవిస్తరం గా రాసి ఉన్నాయి. అలాగే అగ్ని దేవుడు ఎందుకు నీలుని రాజ్యాన్ని సంరక్షిస్తాడో కూడా ఒక చిన్న కథ లా రాసి ఉంది. అదంతా మరో సారి చెప్పుకుందాము.. నేనైతే  నగర ద్వారం లో అగ్ని జ్వాలలు పుట్టించి నీలుడు సహదేవుని నగర ప్రవేశాన్ని అడ్డుకున్నాడని, దాన్ని నకులుడు ఆర్పి నీలుని చేరుకున్నాడని అర్థం చేసుకున్నాను. ) కూడా ఓడించి త్రిపుర, పౌరవ, సౌరాష్ట్ర, కౌశిక రాజ్యాల వారిని కూడా జయించి, రుక్మి రాజు దగ్గరకి చేరతాడు. ఇతను ఇదివరకు కృష్ణుని చేతిలో పరాజయం పొంది తర్వాత కృష్ణునికి మిత్రుడయిన వాడే. ఆనందం గా సహదేవుని ఆదరించి మణులు,ఇతర ఆభరణాలు, సంపదలనిచ్చి పంపుతాడు.  ఇంకా దక్షిణం దిక్కు ప్రయాణిస్తూ, సుర్పరక, దండక,తలకట రాజ్యాలని ఆక్రమిస్తూ, (అంటే ఆధిపత్యం ఒప్పుకుని కొంత కప్పంగా కట్టించుకోవడం, లేదా యుద్ధం చేసి గెలిచి తీసుకోవడం)  సముద్ర తీరపు మ్లేచ్ఛ రాజులందరినీ జయించి, నర మాంస భక్షకులని, కర్ణ,ప్రవర్ణ, కలముఖులని (మానవ, రాక్షసుల క్రాస్ ) కోల్ పర్వతం, సురభిపట్నం, తిమింగల, కేరక (వీరు ఒంటి కాలు గలవారు) తెగలని, సంజయంతి పట్నాన్ని, తామ్ర ద్వీపాన్ని, రామక పర్వతాన్ని, గెలుచుకున్నాడు. ఇక పాషండ, కరహతక రాజులకి రాయబారులని పంపి కప్పం వసూలు చేశాడు.  పౌంద్ర్య, ద్రవిడ, ఉద్రకేరాల, ఆంద్ర, తలవన, కళింగ, ఉష్ట్రకర్ణిక రాజ్యాలనీ జయించాడు. ఆటవి, యవన రాజ్యాలనీ జయించి సముద్ర తీరానికి చేరి పులస్త్యుని మనవడు విభీషణునికి రాయబారిని పంపగా ఆ రాజే సహదేవుని ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం పంపిస్తాడు.
అరణ్య అజ్ఞాత వాసాలు..
అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు సహదేవుడు దుఃఖం, కోపం, అసహాయత లతో, ముఖానికి మడ్డిగా ఉండే నూనె,తదితర పదార్థాలని  రాసుకుని.. హస్తిన వీధుల్లోంచి వెళ్తాడు. అరణ్య వాసం లో ఎప్పటిలాగే అన్నల పట్ల నిబద్ధత తో, ద్రౌపది కి సాధ్యమైనంత సౌఖ్యం గా ఉండేట్టు చూసుకుంటాడు.
అజ్ఞాత వాసం లో సహదేవుడు తంత్రి పాలుడు అన్న పేరు తో, విరాట రాజు పశువుల కొట్టం సంరక్షకుని గా చేరతాడు.  సహదేవుడు పశువుల సంరక్షణ, అలాగే మంచి జాతి పశువుల ని గుర్తించడం లో, పాలు పితకడం, వాటికి ముద్రలు వేయడం, అలాగే మదం తో ముందుకి ఉరికే పశువులని దారికి తేవడం లో నిపుణుడు.
సహదేవుడు కూడా  కౌరవులకి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తూ యుద్ధరంగం లో తన శంఖాన్ని పూరించాడు.

Friday, March 22, 2013

శ్లో: 11,12,13 - కృష్ణార్జునుల స్నేహం -సుభద్రా పరిణయం.

అర్జున విషాద యోగం: పన్నెండు, పదమూడు మరియు పధ్నాల్గవ శ్లోకములు'

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||

తాత్పర్యం
అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.

తత శ్శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః |
సహసై వాభ్యహన్యంత స శబ్దస్తుములో௨భవత్
||
తాత్పర్యం
వెంటనే కౌరవవీరుల శంఖభేరీ ఢక్కామృదంగ గోముఖాది ధ్వనులతో దిక్కులన్నీ పిక్కటిల్లాయి.

తత శ్శ్వే తైర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||
తాత్పర్యం
అప్పుడు తెల్లగుర్రాలు కట్టిన మహారథం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్యశంఖాలు పూరించారు.

నేపధ్యం:
కౌరవులు తమ వైపు నుంచి యుద్దానికి తమవైపు నుంచి సిద్ధం అన్నట్టు గా అందరికన్నా ముందు కౌరవ సైన్యాధిపతి శంఖం పూరించగా, ఆ వెంబడ మిగిలిన వీరులు కూడా కొందరు శంఖాలు, ఢక్కా, మృదంగం  వంటి వాయిద్యాలతో సైన్యానికి ఉత్సాహం కలిగించారు. అది విన్న  పాండవ సైన్యం వైపు వీరుల్లో మొట్ట మొదటి వరుస లో ఉండాల్సిన వారు కృష్ణార్జునులు వీరూ తమ శంఖాలని పూరించారు.

కృష్ణార్జునునుల స్నేహం..
తెలుగు వారికి కృష్ణార్జునుల గురించి చెప్పడం అంటే దుస్సాహసమే.. వీరి బాంధవ్యం గురించి అమ్మమ్మల, నాయనమ్మల కథలు వింటూ, పౌరాణిక కథలు చదువుతూ, నాటకాలు చూస్తూ, వేస్తూ, NTR సినిమాలు చూస్తూ, మంచి స్నేహం కల బావా మరుదులని కృష్ణార్జునులతో పోలుస్తూ జీవిస్తున్న జాతి మనది. అయినా.. సాహసం చేసేస్తున్నా..

ఆదిపర్వం లో ధృతరాష్ట్రుడు సంజయునితో, మాట్లాడుతూ ‘ఆ కృష్ణార్జునులు సాక్షాత్తూ నరనారాయణులు అని నారదుడు చెప్పగా విన్నప్పుడే ఈ యుద్ధం లో కౌరవుల గెలుపు అసాధ్యమని నిశ్చయించుకున్నాను..,  అంటాడు.
మొదటిసారి కలవడం..
ద్రౌపది స్వయంవరానికి కృష్ణుడు బలరాముడితో కలిసి వస్తాడు. అక్కడ ఆర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపది తో సహా తమకి ఆశ్రయమిచ్చిన కుమ్మరివారింటికి వచ్చేస్తారు. బలరామకృష్ణులు వారి వెనకగా వచ్చి, తమ పరిచయం చేసుకుంటారు. ఆర్జునుడు కృష్ణుని చూడటం అదే మొదటి సారి.
సుభద్ర తో అర్జునుడి పెళ్లి..
ఖాండవ వనాన్ని  లో పాండవులు అన్ని రకాలు గా అభివృద్ధి లోకి తెచ్చి, సిరి సంపదలతో తులతూగుతుండగా, ఒకసారి ధర్మరాజు అర్జునుని అడవికి ఏదో ఒక విషయం మీద పంపుతాడు. అలాగ అడవుల్లోకి వెళ్లిన అర్జునుడు పదకొండేళ్లు అక్కడే ఉండిపోతాడు.  నాగరాజ్యం లో ఉలూపి ని పెండ్లి చేసుకుని అక్కడ ఒక సంవత్సరం, అలాగే  మణిపుర రాకుమారి, చిత్రసేనుని కుమార్తె చిత్రాంగద ని చేసుకుని ఒక మగ బిడ్డని కని అక్కడొక మూడేళ్లు గడిపి, అటూ ఇటూ తిరిగి అప్సరలకి శాప విమోచనం కల్గించి మళ్లీ మణిపురానికి వెళ్లి చిత్రాంగద ని చూసి, సెలవు తీసుకుని చివరకి గోకర్ణం (గోవా దగ్గర ) చేరుకుంటాడు..  అక్కడి నుండీ పడమటి సముద్ర తీరం లో ఉన్న పుణ్య తీర్థాలన్నింటిలో స్నానాలు చేస్తూ, ప్రోభస కి చేరుకుంటాడు.
ఈ విషయం విన్న కృష్ణుడు వెళ్లి  అర్జునుని కలిసి ఆప్యాయం గా కౌగలించుకుని క్షేమ సమాచారాలు తెలుసుకుని ‘ఎందుకయ్యా.. ఈ పుణ్య తీర్థాల చుట్టూ తిరుగు తావు? కొన్నాళ్లు నా దగ్గర ఉందువు గాని రమ్మని’ ద్వారకకి ఆహ్వానించి కొంతకాలం అక్కడే గడిపి అక్కడినుంచి తమ తో పాటూ రైవకత పర్వతం దగ్గరకి తీసుకుని వెళ్తాడు. అక్కడ యాదవులు, ఇంకా అంధక జాతి వారి పండగకి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి.  జరుగుతోంది. రకరకాల నాటకాలు, నృత్యాలు, గానాలు, వాతావరణం అంతా ఉత్సాహపూర్వకం గా ఉంటుంది. అక్కడ అర్జునుడు తాను పదకొండేళ్లలో చూసిన నదులు, పర్వతాలు తదితర విషయాలన్నీ చెప్పుకుంటాడు. తర్వాత వీరిద్దరూ ద్వారక కి చేరుకుంటారు.  అక్కడ కృష్ణుని అతిథి గా చాలా రోజులుండిపోయి మళ్లీ రైవకత పర్వతం మీద జరిగే పెద్ద పండుగ కోసం మళ్లీ చేరతారు. ఆ పండుగ వృష్ణి జాతి వారికీ, అంధక జాతి వారికీ, చాలా ప్రీతికరమైనది. ఉగ్రసేన మహారాజు తో సహా, ఎందఱో యాదవ ప్రముఖులు, సామాన్యులు కొండ కోసం చేసే పండుగ లో పాలు పంచుకోవడానికి ఉత్సాహం గా చేరుకుంటారు. కృష్ణార్జునులు ఒక జట్టు గా తిరుగుతూ సరదాగా గడుపుతుండగా, సర్వాలంకార భూషితురాలై సుభద్ర తన చెలి కత్తేలతో రావడం చూసిన అర్జునుడు సుభద్ర నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతాడు. అది కనిపెట్టిన కృష్ణుడు “అర్జునా! ఆ అమ్మాయి నా చెల్లెలు. నీకు తన మీద దృష్టి ఉన్నట్లయితే మా నాన్న తో కావాలంటే మాట్లాడుతాను. చెప్పు’ అని అంటాడు.  
దానికి అర్జునుడు “వసుదేవుని కూతురు,  కృష్ణుని చెల్లి, ఇంత అందమైన అమ్మాయిని ఎవరు ఆశించరు? సుభద్ర ని పెళ్లాడటానికి  నేనేం చేయాలో చెప్పు! చేస్తాను..’ మానవ మాత్రులు చేయగలిగినదేది చేయాలన్నా నేను సిద్ధం గా ఉన్నాను..’ అంటాడు..
కృష్ణుడు చిరునవ్వు నవ్వి “అర్జునా! స్వయంవరం లో భర్తనెన్నుకోవడం క్షత్రియ స్త్రీల పధ్ధతి. అయితే, నా చెల్లి మనసు లో నువ్వున్నావని నేననుకోను.. నా చెల్లి వేరేవారిని వరించే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు బలవంతం గా నా చెల్లిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు” అని ప్రోత్సహించి ధర్మరాజుకి సందేశం పంపుతాడు. ధర్మరాజు ఆ సందేశం చదివి తన సమ్మతి ని తెలియచేస్తాడు.  అన్నగారికి  సమ్మతమేనని తెలుసుకున్న అర్జునుడు వెంటనే కృష్ణునితో సుభద్ర ని ఎత్తుకుపోయే వ్యూహం పన్ని రైవకత పర్వతం నుండి ద్వారక కి వెళ్లే మార్గం లో కాపు కాస్తాడు. సుభద్ర రైవకత పర్వత రాజుకి పూజ చేసి, పర్వత ప్రదర్శనం కూడా చేసి ద్వారక వైపు వెళ్తుండగా ఆదాట్టున అడ్డగించి తన రథం మీదకి ఎత్తి కూర్చోపెట్టి వేగం గా ఇంద్రప్రస్థం వైపు రథాన్ని తీసుకెళ్తాడు.
సుభద్రాదేవి అంగరక్షకులు నిర్ఘాతపోయి ఒక్క క్షణం దిక్కుతోచక నిలబడి ద్వారక వైపు పరుగు దీసి ఈ వార్తని యాదవ ప్రముఖులకి చేరవేస్తారు. ఆ విషయం తెలుసుకున్న అధికారి డప్పుని కొట్టి అందరికీ అపాయ సూచన ఇస్తాడు.  భోజనం చేస్తున్న యాదవులు, అంధకులు, అన్ని వైపులనుండీ తాము చేస్తున్న పని వదిలి ఆయుధాలు పట్టి రథాలకి గుర్రాలని కట్టి కవచాలు ధరించి ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ నిలబడగా,
బలరాముడు దుఃఖంతోనూ, క్రోధం తోనూ, అవమాన భారం తోనూ, ఆ సభ లో “కృష్ణా! ఎందుకు మౌనం గా కూర్చున్నావు? నీగురించే కదా.. ఆ అర్జునికి మన రాజ్యం లో ఆహ్వానమూ, ఆదరమూ లభించాయి? అతను ఈ ఆదరాభిమానాలకి పాత్రుడా? ఆ అథముడికి  కి మన మన్నన నందుకునే అర్హత ఉందా? గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చిన మనిషి ఎవరైనా భోజనం పెట్టిన కంచాన్నే పగలగొడతాడా? మన చెల్లినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నవాడికి మన మర్యాదలు ఒక్క క్షణానికైనా గుర్తురాలేదా? బలవంతం గా చెప్పకుండా తీసుకెళ్లే అవసరం ఏముంది? నా తల మీద కిరీటాన్ని కాలితో తన్నినట్లు అనిపిస్తోంది నాకు.  నేను పిరికి గా ఇదంతా భరించాలా? కట్టి వేసిన పాము లాగా బుసలు కొడుతూ ఊరుకోవాలా? నేనొక్కడనే ఈ పాండవులని వెళ్లి ఎదుర్కుంటాను. అర్జునుడిని ఈ విషయం లో ఎప్పటికీ క్షమించలేను’ అని అన్నాడు. దానికి అక్కడున్న భోజులు, వృష్ణులు, అంధకులు అందరూ సంపూర్ణ మద్దతు నిస్తూ హర్ష ధ్వానాలు చేశారు.
అందరి నిరసనలతో సభ మారుమ్రోగుతుండగా, కృష్ణుడు గంభీరం గా “అర్జునుడు మనకి ఏవిధమైన అవమానమూ  చేయలేదు. నిజానికి అతని ఈ చర్య వల్ల మన గౌరవం పెరిగింది. మన జాతి డబ్బు కోసం నీతి తప్పే జాతి కాదని అర్జునునికి తెలుసు. స్వయంవరం లో సుభద్ర అతని మెడలో మాల వేస్తుందన్న నమ్మకం అతనికి లేదు. ఒక జంతువుని ఇచ్చినట్లు బహుమానం గా భార్యని తెచ్చుకోవడం అతనికి అవమానకరం. అలాగే కన్యా శుల్కం మనం పుచ్చుకుని పెండ్లి చేయం. ఇవన్నీ ఆలోచించే బలవంతం గా తీసుకెళ్లటం మాత్రమే సరైన పధ్ధతి అని అతను భావించాడు. ఈ పెళ్లి సరైనదే. సుభద్ర, అర్జునుడు ఇద్దరూ ఒకరికి ఒకరు తగిన వారు.
శంతునుడి భరత వంశస్థుడైన అర్జునుడు, కుంతిభోజుని మనవడు! ఒక్క మహేశ్వరుడి తో తప్ప ఎవరితోనూ ఓటమి లేని వాడు, మన స్నేహితుడు కావడం మనకి ఎంత మంచిది? అతని వీరత్వానికి సమానులెవ్వరు?  అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరకముందే వెనక్కి తెచ్చి సత్కరించి పెండ్లి చేస్తే మంచిది. లేకపోతే అది మనకి అవమానం.” అన్నాడు.
కృష్ణుని మాటలకి సభ లో ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. అర్జునుని తెచ్చి పెళ్లి చేశారు. తర్వాత కృష్ణుడు సంవత్సరం పాటూ ద్వారక లోనే ఉండిపోయాడు. కృష్ణార్జునులు మేనత్త మేనమామల పిల్లలూ, స్నేహితులే కాకుండా ఈవిధం గా బావా బావ మరుదులు కూడా అయ్యారు.
నిజం గా కృష్ణుని మాటలు అందరికీ నచ్చాయా?
నాకయితే, బలరాముడి మాటలే న్యాయమనిపించాయి. కృష్ణుని మాటలని తోసిబుచ్చటానికి లేకుండా ఉన్నాయేమో కానీ, సుభద్ర మనసు లో ఏముందో తెలుసుకోకుండా జరిగిన వివాహమే ఇది. ఒక విధం గా బలవంతపు పెళ్లే! కాకపోతే కృష్ణుడు పెద్ద వ్యూహం తో చేసిన పని కాబట్టి..
కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

Sunday, March 3, 2013

శ్లో:11 - మహా భారత యుద్ధ సమయానికి భీష్ముని వయసెంత?

అర్జున విషాద యోగం: పదకొండవ శ్లోకము'
అయనేషు చ సర్వేషు యథాభాగ మవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి ||

తాత్పర్యం
అందువల్ల మీరంతా యుద్ధరంగంలో మీ మీ స్థానాలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముణ్ణి కాపాడాలి.

నేపధ్యం:
పాండవుల సైన్యం పరిమితం, తన వైపు సైన్యం అపరిమితమని, అలాగే భీష్మద్రోణాదుల  గురించి,  తమవైపు సైన్యం గురించి గొప్పలు చెప్పిన దుర్యోధనుడు మళ్లీ

"అందువల్ల మీరంతా మీ స్థానాలలో గట్టిగా నిలబడి భీష్ముణ్ణి కాపాడాలి.. " అనడం కొద్దిగా విచిత్రం గా అనిపిస్తుంది. 

భీష్ముడు ఒక మహారథి. అంటే అరవై వేల మంది సైనికులతో ఒకేసారి యుద్ధం చేయగల శక్తి ఉన్నవాడు. అటువంటి గొప్ప యౌద్ధుని  కాపాడమని చెప్పడం లో రెండు రకాల అర్థాలు గోచరిస్తాయి.
ఎంత బీరాలు పలికినా, పాండవులకన్నా నాలుగు అక్షౌహిణుల సైన్యం ఎక్కువ తమ పక్షాన ఉన్నా, దుర్యోధనుడికి పాండవులే గెలుస్తారనే భయం ఉంది. లేదా తమ  సైన్యానికి అద్యక్షుడు కాబట్టి ఆయన ని ఎల్ల వేళలా రక్షించుకోవాలని అని కూడా ఉండవచ్చు.
మహా భారత యుద్ధ సమయానికి భీష్ముని వయస్సెంత?
ఆరోజుల్లో మనుషులు వందలాది ఏళ్లు బ్రతికేవారు.. అంటారు.  ఆ మాటెలా ఉన్నా, ఈ కాలం లెక్కల బట్టి చూస్తే మాత్రం భీష్ముడు మహా భారత యుద్ధం సమయానికి వృద్ధుడు. ఐచ్చిక మరణం పొందే వరం కలిగిన వాడైనా వయసు భారం అతని మీద తప్పక ఉండే ఉంటుంది.    ఆయనకి సైన్యం పై గౌరవాధిపత్యం ఇచ్చి ఉండవచ్చు లేదా ఈయన అసామాన్యమైన శక్తి పరుడు /లేక ఆకాలపు మనుషులంతా  చాలా బలశాలులై ఉండవచ్చు.
శంతనుడు, మరియు గంగాదేవిల  కొడుకు ఈయన.   గంగా దేవి శంతనుడి తో పెళ్లి కి ముందు పెట్టిన షరతు ప్రకారం  పుట్టిన ఏడుగురు సంతానాన్ని ఏవిధం గా అయితే తీసుకెళ్లి అంతం చేసిందో,  అదే విధం గా దేవవ్రతుడు (భీష్ముడు) పుడుతూనే చంపడానికి తీసుకు వెళ్తున్నప్పుడు శంతనుడు ఊరుకోలేకపోతాడు. ఏమైతే అయిందని గంగని ఆపుతాడు.

ముందు చేసుకున్న ఒడంబడిక ప్రకారం, గంగ అతని జీవితం లోంచి వెళ్లిపోతుంది. అయితే దేవవ్రతున్ని విద్యా బుద్ధులు చెప్పించి మళ్లీ అప్పగిస్తానని చెప్పి తీసుకెళ్తుంది.

తర్వాత శంతనుడు ముప్ఫై ఆరేళ్ల వయసు లో, అడవికి వేటకి వెళ్లినప్పుడు అక్కడ గంగ పాయ ఒకటి మరీ చిక్కి కృశించి కనిపిస్తుంది. ఎందుకా అని ఆరా తీసినప్పుడు
 “ఇంద్రుడి వంటి తేజస్సు గల” ఒక యువకుడు తన అస్త్రాలతో ప్రవాహాన్ని కట్టడి చేసినట్లు గ్రహిస్తాడు.  ఈలోగా గంగ కనిపించి ఆ యువకుని తమ కొడుకు గా పరిచయం చేసి  దేవవ్రతుడు సకల విద్యలూ అస్త్ర శస్త్రాలనీ అభ్యసించాడని చెప్పి అతన్ని తండ్రికి అప్పగిస్తుంది. 

 తండ్రి తనతో తీసుకెళ్లిన నాటికి దేవవ్రతునికి దాదాపు పద్ధెనిమిది సంవత్సరాల వయసు అయినా ఉండి ఉంటే, ...

తరువాత నాలుగేళ్లకి శంతనుడు అడవికి వెళ్లి సత్యవతి ని కలవడం, తర్వాత వారి పెళ్లీ, చిత్రాంగద విచిత్ర వీర్యుల జననం, వాళ్లకి పెళ్లిళ్లు జరిపించడం,.. ఇదంతా అవడానికి ఒక ఇరవై ఏళ్లయినా అయుండవచ్చు అనుకుంటే  అప్పటికే భీష్ముడు నలభై ఏళ్ల వాడు. 

 తమ్ముళ్ల అకాల మరణం తర్వాత,  వ్యాసుని సహకారం తో ధృతరాష్ట్ర, పాండు, విదురుల పుట్టుక, వారు మళ్లీ పెద్దయినతర్వాత పెళ్లిళ్లు ... ఇదంతా జరగడానికి ఇంకో ఇరవై ఏళ్లవుతుందనుకున్నా, భీష్ముడు  అప్పటికి అరవైల్లో పడి ఉండాలి.

కౌరవ పాండవ జననం, వారు మళ్లీ పెద్దవారై లాక్షా గృహ దహనం సమయానికి ఇంకో ఇరవయ్యేళ్లు?  అంటే కనీసం ఎనభై!  కౌరవ పాండవులకి జూదం, అలాగే పాండవ వనవాసం ఇదంతా కనీసం ఇంకో పదిహేనేళ్లు.. వెరసి కనీసం తొంభై అయిదేళ్లు ఉంటాయి.
భీష్మునికి యుద్ధం నాటికి  మూడు వందల ఏళ్లనీ, నూట ఇరవయి ఏళ్లనీ, నూట డెబ్భై ఏళ్లనీ రకరకాల సూత్రాలు చదివినా,  నాకు నూట ఇరవయి ఏళ్లని ‘పర్వ’ పుస్తకం లో ప్రొ. భైరప్ప లెక్క ఎక్కువ నమ్మ శక్యం గా ఉంటుంది.

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

Thursday, February 21, 2013

శ్లో 10: భీముడు Vs దుర్యోధనుడు..

అర్జున విషాద యోగం: పదవ శ్లోకము
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విద మేతేషాం బలం భీమాభిరక్షితమ్ ||

తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)

భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం.
 
నేపధ్యం..
భీష్ముడు కౌరవుల సైన్యానికి నాయకుడు. ఇటు పాండవులకి భీముడు సేనాని కాకపోయినా,  భీముడి రక్షణ లో ఉన్న పాండవ సైన్యం అనడం లో దుర్యోధనునికి భీముడంటే ఉన్న వైరం  కనపడుతుంది. తనకి దీటైన వాడు పాండవ సైన్యం లో భీముడే అన్న నమ్మకమూ కనిపిస్తుంది.
చిన్నప్పుడు..
చిన్నప్పటినుంచీ భీముడికీ, దుర్యోధనుడికీ ఏనాడూ పడలేదు.  పాండు రాజు మరణించాకా మాద్రి సహగమనం చేయగా, కుంతీ దేవి ఐదుగురు పాండవులనీ తీసుకుని హస్తినాపురానికి వస్తుంది. మొదటి నుంచీ భీముడు చాలా బలమైన పిల్లవాడు. అలాగే తుంటరి కూడా!
చిన్నప్పుడు పాండవులూ, కౌరవుల ఆటల్లో పాండవుల దే పై చేయి అవుతూ ఉంటుంది.  వేగంలో, లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం లో, తిండి లో, దుమ్ము రేపడం లాంటి విషయాల్లో అన్నింటిలో పాండవుల ఆధిక్యత దుర్యోధనుడు సహించలేకపోయేవాడు. భీముడు కౌరవులందరినీ కొట్టి ఆనందించేవాడు. అలాగే వారి జుట్టు పట్టుకుని లాగి ఒకరిని ఒకరు ఢీ కొట్టుకునే లా చేసి  పక పకా నవ్వేవాడు.  జుట్టు చేత బట్టి బరబరా నేల మీద ఈడుస్తూ తీసుకెళ్లే వాడు. పది మంది కౌరవులని ఒక్కసారి గా నీట ముంచి గిల గిల తన్నుకుని ఊపిరి దాదాపు ఆగిపోయేదాకా వదలకుండా ఏడిపించేవాడు. కౌరవులు పండ్లు కోయాలని చెట్లెక్కితే, కాండాన్ని పట్టుకుని ఊపి, పండ్లతో బాటు పిల్లలూ పడేలా చేసి ఆనందించేవాడు.
వీటి తో విసిగి వేసారి దుర్యోధనుడు భీముని పట్ల అంతులేని అయిష్టతనీ, అసహనాన్ని,కోపాన్నీ పెంచుకున్నాడు. అయితే భీముడి బలానికి భయపడి, భీముడు నిద్రపోతున్నప్పుడు గంగలోకి  పడేయాలని తలచి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. 
కొన్నాళ్లకి అవకాశం రానే వచ్చింది. ప్రమాణకోటి అన్న స్థలం దగ్గర గంగ ఒడ్డున ఒక రాచ భవనం తయారయింది. అక్కడ రాకుమారుల వినోదం కోసం నీటి లో ఎన్నో రకాల ఆటలు ఆడేందుకు అనువు గా ఎన్నో అమర్చారు. అక్కడకి వెడదామని దుర్యోధనుడు పాండవులని పిలుస్తాడు.  అందరూ అక్కడ ఆట పాటల్లో, విందులూ, వినోదాల్లో మునిగి తేలుతూ సంతోషం గా గడుపు తున్నప్పుడు దుర్యోధనుడు శక్తివంతమైన విషాన్ని తెచ్చి భీముని ఆహారం లో కలిపుతాడు. స్పృహ తప్పిన భీముడిని లతలతో కట్టి గంగలో విడుస్తారు. అయితే భీముడు నాగలోకానికి వెళ్లటం,అక్కడ విషానికి విరుగుడు లభించడమే కాక అమృత తుల్యమైన ద్రవం తాగి పదివేల ఏనుగుల బలం తో వెనక్కి రావడం జరుగుతుంది. పాండవులు ఈ విషయం బయటికి పొక్క నీయకుండా యుదిష్టిరుని మాట మీద మౌనం వహిస్తారు.
ఇంకో మారు కూడా దుర్యోధనుడు భీమునికి కాల కూట విషం ఇచ్చి నప్పుడు యుయుత్సుడు (ధృతరాష్ట్రునికి ఒక వైశ్య స్త్రీ ద్వారా పుట్టిన కొడుకు) హెచ్చరిస్తాడు. అయినా భీముడు ఒక్క గుక్క లో తాగి హరాయించుకుంటాడు.
విద్యార్థులుగా..
భీమ దుర్యోధనులిద్దరూ ఒకే రకమైన ప్రజ్ఞ గలవారు. దానితో ద్రోణుని దగ్గర విద్యాభ్యాసం కూడా చాలా స్పర్థలకు దారితీసింది.
ద్రోణాచార్యునికి గురు దక్షిణ గా ద్రుపదుని ఓడించి ముందు నిలుపుతామని ప్రతిజ్ఞ చేసిన కౌరవులు పరివార సహితం గా దండెత్తి చిత్తు గా ఓడిపోగా, పాండవులు ఆ పని చేసి ఖ్యాతి సంపాదించు కోవడం తో దుర్యోధనునికి అవమాన కరం గా తోస్తుంది.
పెద్దవారయ్యాకా..
లక్క ఇంటి దహనం తర్వాత  భీముడు దుర్యోధనుని క్షమించ లేకపోతాడు.  పాండవులు, పిన తల్లి తో సహా మరణించారని, తానే ఇక హస్తినాపురి కి మహా రాజునన్న ధీమా తో ఉన్న దుర్యోధనునికి వీరు ద్రౌపది ని స్వయంవరం లో గెలుచుకుని మళ్లీ వెనక్కి రావడం,
దానితో పోయారనుకున్న వారు, ఖాండవ వనాన్ని ఇంద్రప్రస్థం గా మలచుకుని అత్యంత వైభోగంగా ఉంటూ, రాజసూయ యాగం తో, తమకి భారత వర్షం లో ఎవ్వరూ సాటి లేరని చెప్పకనే చాటి చెప్పడం.. దుర్యోధనుడు భరించలేకపోతాడు. మయసభ విశేషాలు చూస్తున్నప్పుడు అక్కడి వింతల వల్ల పడిపోయినప్పుడు, తగిలించుకున్నప్పుడు భీమార్జునులు నవ్వడం తో ఓర్వలేక  జూదం పేరుతో పాండవులని ఓడించి వారికి ఏమీ లేకుండా చేయాలని దుర్యోధనునికి కోరిక కలుగుతుంది. దాని వెనక ప్రేరణ కర్ణుడు మరియు శకుని.
జూదంలో పాండవులు ఓడి కౌరవులకి దాసులై వారి భార్య(ద్రౌపది) నీ దాసిని చేసాకా, ద్రౌపదిని అనరాని మాటలు అని, నిండు సభలో  ద్రౌపది వస్త్రాపహరణం సమయం లో, భీముడు తన అన్న ధర్మరాజు మాటకి కట్టుబడి క్రోధాన్ని, అవమాన భారాన్నీ దిగమింగుకున్నా, కర్ణుని మాటలకి కలిగిన ఆవేశాన్ని బలవంతం గా ఆపుకుని దుర్యోధనుడినికి ‘సూత పుత్రుడు అన్న మాటలని దాస్యం వాళ్ల కోపం తెచ్చుకోకుండా ఊరుకున్నాను.. కానీ..అదే శత్రువులైతే నా.. ‘ అని  సమాధానం చెప్తున్నంత లో,..  దుర్యోధనుడు కర్ణునికి మద్దతు తెలుపుతూ, ద్రౌపది కి తన ఎడమ తొడ ని చూపించి సంజ్ఞ చేసినప్పుడు, భీముడు ఆ ఎడమ తొడని యుద్ధ భూమి లో బద్దలు కొడతానని ప్రతిజ్ఞ చేస్తాడు.  దుర్యోధనుడూ యుద్ధ భూమి లో భీముని చంపాలని ఉవ్విళ్ళూరతాడు
వన వాసానికి పంపేసినా పాండవులతో ఏదో విధం గా పేచీ పెట్టుకుని ఆనందించాలని  దుర్యోధనుని కోరిక. కర్ణుడు పాండవులు నార బట్టలు కట్టి అడవుల్లో తిరుగుతున్నప్పుడు నీవు, నీ భార్య, ఇతర పరివారం అనుభవిస్తున్న వైభోగం, పట్టు వస్త్రాలు,అలంకారాలు,వాహనాలు, మందీ,మార్బలం చూపిస్తే వచ్చే ఆనందానికి ఏదీ సాటి రాదని ఇచ్చిన  సలహా మేరకు గోవుల తనిఖీ పేరున పాండవులు నివసించే ద్వైతవనం పక్క నున్న పశుశాలల తనిఖీ కి వెళ్లినట్లు గా వెళ్లి పాండవులకి తమ వైభోగం చూపించి వారి కళ్లల్లో ఈర్ష్య చూడాలని వెళ్లి గంధర్వుల దాడిలో ఓడి  అంతఃపుర స్త్రీలతో సహా బంధింప బడి చివరకు పాండవులే యుద్ధం చేసి విడిపించి పంపించడం తో దుర్యోధనునికి అవమాన భారం ఇంకా ఎక్కువైంది.
పాండవులు తమ మానాన వనవాసం లో కాలం గడుపుతున్నప్పుడు దుర్యోధనుని బావ సింధురాజు జయదద్రుడు ద్రౌపది ని చెరపట్టి తీసుకెళ్లుతుండగా పాండవులు ఎదిరించి, చంపబోగా ద్రౌపది చెల్లెలి భర్త ని వదలమని చెప్పడంతో భీముడు  అతనికి గుండు గొరిగించి పంపుతాడు. ఇదీ ఒక అవమానం గా ఇటు దుర్యోధనుడు, అటు భీముడూ భావిస్తారు.
పాండవులు పన్నెండేళ్ళు వనవాసం చేశారు. దాదాపు యవ్వనమంతా కందమూలాలు తింటూ,నారా వస్త్రాలతో, అడవుల్లో గడిపారు. తర్వాత అజ్ఞాత వాసం లో విరాట రాజుకి దాస్యం చేస్తున్నప్పుడు కూడా చారులని పెట్టి వారిని ఎలాగో ఒక లాగున కనిపెట్టి తిరిగి అడవుల పాలు చేయాలనే దుగ్ధ తో ఉన్న దుర్యోధనునికి  మత్స్య దేశపు రాజు విరాటుని బావమరిది కీచక వధ విషయం తెలిసి, ఇది చేసినది తప్పక భీముడే నని భావించి గోగ్రహణానికి పరివార సహితం గా వస్తే అక్కడా ఓటమి తప్పలేదు. 
షరతు మేర పన్నెండేళ్లు వనవాసం, ఏడాది పాటూ అజ్ఞాత వాసం చేసి మాట నిలుపుకున్న పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వనని, ఆ మాటకొస్తే పాండవులు కురువంశానికి చెందినవారే కారన్నట్టు దుర్యోధనుడు అన్న మాటల తర్వాత ఏ సంధి ప్రయత్నాలూ ఫలించలేదు.
ఈవిధం గా ఇద్దరు దాయాదులూ  యుద్ధం లో తలపడటానికి ఉవ్విళ్ళూరుతున్నారు...

కృష్ణ కృష్ణ
తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి,
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)

Sunday, February 17, 2013

శ్లో: 8,9 - కౌరవుల పక్షాన నిలచిన మహా వీరులు..


అర్జున విషాద యోగం: ఎనిమిది,తొమ్మిదవ శ్లోకములు

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ || 
అన్యే చ బహవశ్శూరాః మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||  

తాత్పర్యం: (గీతా ప్రెస్,గోరఖ్ పూర్ వారి పుస్తకం నుంచి)
మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తి వున్నారు. ఇంకా ఎంతోమంది శూరాగ్రేసరులూ, యుద్ధవిశారదులూ నా కోసం జీవితాల మీద ఆశ వదలి సిద్ధంగా వున్నారు.
నేపధ్యం:

ద్రోణుడు: భరద్వాజ ముని కొడుకు. భరద్వాజ ముని తన గంగా దేవికి ఆర్ఘ్యం ఇవ్వటానికి రోజూ లాగే వెళ్లినప్పుడు ఒక అందమైన స్త్రీ ఘ్రితాచి ని నీటిలో చూసి, ఆకర్షింపబడి నప్పుడు వీర్యాన్ని ఒక గిన్నె లో భద్రపరుస్తాడు. అందులోంచి పుట్టిన వాడే ద్రోణుడు. ఇతను తన తండ్రి వద్దే విద్యాభ్యాసం చేస్తాడు. ద్రుపదుడు కూడా భరద్వాజ ముని వద్దే విద్యాభ్యాసానికి రావడం తో ద్రోణునికి, ద్రుపదుని తో స్నేహం కుదురుతుంది. ద్రోణుడు శారద్వతుని కుమార్తె కృపి ని పెండ్లాడతాడు.వీరి కుమారుడే అశ్వత్థామ. ఎన్నో అస్త్ర శాస్త్రాల జ్ఞాని అయిన  జమదగ్ని మహర్షి తనకున్నదంతా దానం చేసి అడవులకి వెళ్తున్నాడని  విని ద్రోణుడు తన శిష్యులతో కూడి మహేంద్ర పర్వతాల దగ్గరకి వెళ్లి తన గురించి చెప్తాడు. అప్పటికే ఆస్తి పాస్తులన్నింటినీ దానం చేసిన మహర్షి తన అస్త్ర శస్త్రాలన్నిటినీ ద్రోణునికి ఇచ్చి వేస్తాడు. (మిగిలిన కథ : రెండవ శ్లోకం వివరణ లో..)
భీష్ముడు : మహాభారతం గురించి ఒక పేజీ రాసినా, భీష్ముడి గురించి ఒక వాక్యమైనా రాయకుండా ఉండలేము. అందరికీ తెలిసిన కథే అయినా నాలుగు ముక్కలు.. వశిష్టుడి శాపం మూలంగా, అష్ట వసువులూ భూమి మీద శంతనునికీ, గంగ కీ పుడతారు. వారిలో ఆఖరి వాడు (ద్యౌ అని పేరు గల  వసువు)దేవ వ్రతుడు. వశిష్టునివద్ద విద్యాభ్యాసం చేశాడు.శంతనుడు దేవవ్రతుని పెంచి పెద్ద చేయలేదు.పుట్టాకా మళ్లీ విద్యాభ్యాసం అయిన తర్వాతే యాదృచ్ఛికం గా అతనిని చూస్తాడు.  గంగ దేవవ్రతున్ని తండ్రికి అప్పచెప్పిన నాలుగు సంవత్సరాలకి శంతనుడు సత్యవతి తో ప్రేమ లో పడి అది సఫలం కాలేదని పుట్టెడు దుఃఖం లో ఉండటం గమనించి సత్యవతి తండ్రి తో మాట్లాడి అతని షరతు ని అంగీకరించి ఆజన్మాంతం బ్రహ్మచారి గా ఉంటాననీ, అలాగే రాజ్యాధికారాన్ని స్వీకరించననీ, శపథం చేసి ‘భీష్ముడు’ అని పిలవబడతాడు.అలాగే ఐచ్చికమరణం పొందే వరాన్ని పొందుతాడు. తండ్రి మరణానంతరం కురు రాజ్య సంరక్షణ భారంతో పాటూ  సత్యవతి కుమారులైన చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుల సంరక్షణ భారం కూడా చూసుకుంటాడు. ముందు  చిత్రాంగదుని రాజుని చేసి, తర్వాత అతను  గంధర్వులతో జరిగిన యుద్ధం లో మరణించగా,  అప్పటికి ఇంకా చిన్నవాడే అయిన విచిత్రవీర్యున్ని రాజుని చేసి, అతని తరఫున పాలించాడు. అతనికి  వివాహం చేయడానికి కాశీ రాజు కుమార్తెలని (అంబ, అంబాలిక, అంబిక) స్వయంవరం నుంచి ఎత్తుకొచ్చి అడ్డు వచ్చిన రాజులని ఓడిస్తాడు.  అంబ స్వయవరం లో శోభ దేశ రాజుని ఎంచుకోవాలని కోరుకున్నానని, అది తండ్రికీ ఇష్టమేననీ, ఈవిధం గా ఎత్తుకు రాకపోయి ఉంటే తాము భార్యా భర్తలయ్యేవారమని చెప్పగా, ఆమెని పంపించివేస్తాడు. ఈ విధం గా తిరిగి పంపించిన స్త్రీ ని పెండ్లాడనని శోభ రాజు చెప్పడం తో, అంబ తిరిగి భీష్ముని దగ్గరకి వస్తుంది  విచిత్రవీర్యుడు తిరస్కరించగా ఆమె కనీసం భీష్ముడిని తనను పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంది. భీష్ముడు తాను వచన బద్ధుడనని, క్షమించమని అడగగా, వెళ్లి భీష్ముని చంపాలన్న దీక్ష లో ప్రాణాలు విడుస్తుంది. ఈ అంబే భీష్మ వధ ధ్యేయం తో ద్రుపద రాజుకి శిఖండి గా పుడుతుంది. ఏడు సంవత్సరాల తర్వాత విచిత్ర వీర్యుడు క్షయ తో మరణించగా, సత్యవతి తన ప్రతిజ్ఞని వెనక్కి తీసుకుని కురు వంశం ముందుకి వెళ్లేందుకు వీలుగా పెళ్లి చేసుకొమ్మని ప్రార్థించగా, అంగీకరించడు. దానితో వ్యాసుని సహాయం తో అంబాలిక పాండు రాజుని కనగా, అంబిక ధృతరాష్ట్రుని కంటుంది. అలాగే, వ్యాసుని రూపాన్ని, అతని నుంచి వచ్చే వాసనని (రెఫ్: సెక్షన్ 106 :సంభవ పర్వ )తలచుకుని భయపడి దాసీ స్త్రీ ని పంపగా విదురుడు పుడతాడు. భీష్ముడు వీళ్ల పెంపకం భారం కూడా వహించి, హస్తినాపుర సింహాసనానికి సంరక్షకుడిగా నిలబడతాడు.  గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి గాంధారదేశ రాకుమారిని అడిగి తెచ్చి పెళ్లి చేస్తాడు. పాండు రాజుని కుంతీదేవి స్వయంవరానికి పంపి కుంతీ దేవితో పెళ్లి చేయించి, శల్యునికి కన్యాశుల్కమిచ్చి మాద్రీ దేవిని పాండు రాజుకి రెండవ భార్య గా తెస్తాడు. పాండవులకి,  కౌరవులకి ద్రోణుని గురువు గా నియమించి విద్యా బుద్ధులు నేర్పించడమే కాకుండా,..  లక్క గృహ దహనం తర్వాత ద్రౌపది తో పెళ్లి జరిగి పాండవులు బ్రతికే ఉన్నారని బయట పడ్డాకా, పాండవులకి రాజ్యం లో కొంత భాగం ఇవ్వడం లో ప్రముఖ పాత్ర వహిస్తాడు.  అయితే, తర్వాత తర్వాత, ఎప్పుడైతే దుర్యోధనుని ప్రాబల్యం పెరిగిందో, కర్ణుడు ,శకుని వంటి వారి తో భీష్ముని విబేధాలు, పలు మార్లు, అంటే జూదం, ద్రౌపది వస్త్రాపహరణం, గోగ్రహణం.. అలాగే సంధి ప్రయత్నాల్లో..  యుద్ధానికి ముందు కనపడుతూనే ఉంటాయి.
కర్ణుడు; కర్ణుడు లేనిదే భారతం లేదంటారు. (నిజానికి భారతం లో ప్రతి పాత్ర కీ ఔచిత్యం ఉంది). కర్ణుడు కుంతీ పుత్రుడు. కుంతీదేవి దుర్వాస మహామునికి సేవ చేసి సంపాదించుకున్న  వరం మేరకు సూర్య భగవానుని అనుగ్రహం తో సహజ కవచ కుండలాలతో కర్ణుని కంటుంది. అయితే పెళ్లి కాకుండానే కన్న బిడ్డ అవడం తో లోక భయానికి త్యజించవలసి వస్తుంది. కర్ణుడిని ఒక సూతుడు,అతని భార్య రాధ పెంచి పెద్ద చేస్తారు. రాధేయుడిగా పిలవపడతాడు. ఇతను అద్భుతమైన విలుకాడు. దాన ధర్మాలలో పేరు మోసిన వాడు. ఎన్నో శాపాల బారీ పడ్డ వాడు, తాను సూట పుత్రుడవడం తో ఎన్నో సార్లు అవమానాల బారీన పడ్డ వాడు.. హస్తినాపురి లో రాకుమారుల విద్యాభ్యాసం తర్వాత వారి విద్యా ప్రదర్శన లో అర్జునుణ్ణి మించిన విలుకాడు లేడని గర్విస్తున్నప్పుడు తానూ తన విద్యని ప్రదర్శించి అర్జునుని కన్నా గొప్ప వీరుణ్ణి అని నిరూపించడానికి ముందుకి వచ్చినప్పుడు సూత పుత్రునికి అర్హత లేదన్న మాట వినిపించినప్పుడు, పాండవుల మీద ఉన్న కచ్చ తో దుర్యోధనుడు వెంటనే కర్ణుని అంగ రాజ్యానికి రాజు ని చేస్తాడు. ఈ స్నేహ ప్రకటనకీ, నిండు సభ లో తనకిచ్చిన గౌరవానికి చలించిన కర్ణుడు దుర్యోధనుని స్నేహానికి జీవితం లో ఆఖరి క్షణం దాకా బద్ధుడై వ్యవహరిస్తాడు. దుర్యోధనుడు చేసిన మంచీ, చెడుల్లో భాగమై దుష్ట చతుష్టయం లో ఒకరు గా చెప్పుకోబడతాడు. తాను కుంతీ పుత్రుడనని తెలిసినప్పుడు కూడా, స్వయం గా  తల్లి పాండవులందరికీ అన్నయ్య గా అంగీకరిస్తారని ఆహ్వానించినా,  స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి, దుర్యోధనుని పక్షాన నిలుస్తాడు. భీష్ముడు యుద్ధ భూమి లో నిలిచినంతవరకూ తాను యుద్ధం చేయనని చెప్తాడు.
కృపాచార్యుడు: కృపాచార్యుడు హస్తినాపురి రాకుమారులకే కాక అనేకానేక యాదవులకీ..   కూడా  యుద్ధాలలో ఉపయోగించే అస్త్ర శస్త్రాల జ్ఞానం  నేర్పించాడు.  గౌతమ మహర్షి కుమారుడు శారద్వతుడు అస్త్ర, శస్త్ర శాస్త్రాల్లో నిష్ణాతుడు. ఇంద్రుడు ఇతని నుంచి ఆపత్తు రాగలదని యోచించి శారద్వతుని ఆకర్శించమని జనపది అన్న అప్సరస ని పంపుతాడు. అయితే శారద్వతుడు కొద్ది సమయానికి చలించినా తేరుకుని తన జింక చర్మాన్నే, ధనుర్బాణాలనీ వదిలి పారిపోతాడు. ఈలోగా అతని వీర్యం రెండు భాగాలు గా భూమి మీద పడి కవలలు పుడతారు.  శంతన మహారాజు అడవుల్లో వేటకి వచ్చినప్పుడు ఒక సైనికుడు  ఆడ-మగ కవలల తో బాటు ధనుర్బాణాలనీ చూసి బహుశా ఎవరో ముని పిల్లలని భావించి మహా రాజు దగ్గరకి తీసుకువస్తాడు. శంతనుడు వారిని దయతో చేరదీసి తన బిడ్డలు గా వారిని తనతో బాటు తన రాజ్యానికి తీసుకు వెడతాడు. అందువల్లే వారికి కృప-కృపి అన్న పేర్లు వస్తాయి. అయితే మళ్లీ ముని తిరిగి వచ్చి, తన తపశ్శక్తి ద్వారా తన పిల్లలు శంతన మహారాజు వద్ద ఉన్నట్టు తెలుసుకుని మహారాజుకి అంతా వివరించి కృపుడిని యుద్ద శస్త్ర విద్యా పారంగతుడిని చేస్తాడు. కృపాచార్యుడు శంతనుని తండ్రి  గా భావించడం వల్ల, అలాగే కురు రాజ కుమారులకి రెండు తరాలు గా గురువు అవడం వల్ల హస్తినాపుర సింహాసనానికి బద్ధుడై  కౌరవుల పక్షాన యుద్ధం లో నిలుస్తాడు. ఆయన సోదరి కృపి ద్రోణుని భార్య.
అశ్వత్థామ: ద్రోణుని కొడుకు. కృపి ఇతని తల్లి. పుట్టినప్పుడు ఒక గుఱ్ఱపు (అశ్వం) అరుపు లా అరుస్తూ పుట్టాడని ఇతని పేరు అశ్వత్థాముడని పెట్టాలని అశరీర వాణి చెప్పడం తో అదే పేరు స్థిరమవుతుంది. తండ్రి, మేనమామలు అన్ని రకాల అస్త్ర,శస్త్ర విద్యల్లో నిష్ణాతులు, తండ్రి తనకి తెలిసిన విద్యలన్నీ అశ్వత్థామ కి బోధిస్తాడు. ద్రోణుడు కొడుకుని చాలా ప్రేమిస్తాడు. అయితే ప్రపంచం లో అత్యంత గొప్ప విలుకాడు గా అర్జునిడిని చేస్తానన్న మాట కోసం, తన కొడుకుకి  బ్రహ్మాస్త్రం మాత్రం ప్రయోగించడం  మాత్రమే నేర్పిస్తాడు. విరమించడం నేర్పించడు.  అర్జునునికి మాత్రం బ్రహ్మాస్త్రం గురించి సంపూర్ణ జ్ఞానం ఇస్తాడు.  బ్రహ్మాస్త్రాన్ని ఒక్కసారి సంధించి విరమించక పోతే, అది ప్రయోగించిన చోట పన్నెండేళ్ల క్షామం వస్తుంది. బ్రహ్మాస్త్రాన్ని విరమించడం నేర్పించక పోవడం వెనక చేతిలో అస్త్రం ఉంది కదా అని మళ్లీ ఉపయోగించకుండా, మంచి కార్యానికి మాత్రమే ఒకేసారి ప్రయోగించాలన్నది ద్రోణుని ఉద్ద్యేశం కావచ్చు. ఆ విచక్షణ అర్జునికి మాత్రమే ఉందన్న అభిప్రాయం కూడా కావచ్చు.
వికర్ణుడు : వికర్ణుడు కౌరవులలో ఆఖరి వాడు. (దృతరాష్ట్ర/గాంధారుల  కొడుకు). ద్రౌపది కి నిండు కురు సభ లో  దుర్యోధన, కర్ణ, శకుని ల ఆదేశం/ప్రోత్సాహం తో దుశ్శాసనుడి చేతిలో అవమానం జరుగుతున్నప్పుడు, భీష్మ,ద్రోణ, విదురాది పెద్దవారు ఏమీ అనలేక తలలు వంచుకుని కూర్చున్నపుడు వికర్ణుడు మాత్రమే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తాడు.
సోమ దత్త, భూరి శ్రావులు : సోమ దత్తుడు కురు వంశం వాడే. శంతనునికి తమ్ముడు. అతని కొడుకు భూరిశ్రావుడు. వీరిద్దరూ మహా వీరులు. యుద్ధం లో కౌరవుల పక్షాన నిలుస్తారు.
మహా భారతం రిఫరెన్స్ :   THE MAHABHARATA OF KRISHNA-DWAIPAYANAVYASA
ఆంగ్లానువాదం :ప్రతాప్ చంద్ర రాయ్-
 http://www.holybooks.com/mahabharata-all-volumes-in-12-pdf-files/)



కృష్ణ కృష్ణ